Balineni Srinivasa Reddy : రేపల్లే ఘటనపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షాలకు కౌంటర్… చర్యకు ప్రతి చర్య తప్పదని..
Balineni Srinivasa Reddy : గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగిన అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లే ఏపీలో ఇలాంటి సంఘటనలు జరగుతున్నాయిని మండిపడ్డాయి. దీంతో వైసీపీ నేతలు కూడా స్పందిస్తూ కౌంటర్స్ వేస్తున్నారు. ప్రతిపక్షాలు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని ప్రతిపక్షాలు ఘటనపై శవ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితుల విషయంలో గోప్యత కూడా పాటించటం లేదని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు.
కాగా ఒంగోలు రిమ్స్ చికిత్స పొందుతున్న రేపల్లే అత్యాచార బాధితురాలిని మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పరామర్శించడానికి ఒంగోలు వచ్చిన హోంమంత్రిని అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనల్లోనూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం తగదన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, తన వ్యక్తిగతంగా రూ. 2 లక్షలు అందజేసినట్లు తెలిపారు.అయితే అవనిగడ్డలో పని చేసేందుకు రేపల్లే రైల్వే స్టేషన్‌కు దంపతులిద్దరూ చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులు లేవని తెలిసి స్టేషన్‌లోనే పడుకున్నారు. ఇది గమనించిన ముగ్గురు వ్యక్తులు, నిద్రిస్తున్న మహిళని లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన భర్తని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో భర్త వెంటనే 200 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.