Google : వాళ్లకి గూగుల్ బిగ్ షాక్.. ఇకపై ఆ యాప్స్ పనిచేయవ్
Google: థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ విషయంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు అనౌన్స్ చేసింది. యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. దీంతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది.ఇకపై ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు,
ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ సహాయంతో ఆ కాల్స్‌ను రికార్డ్ చేయడం ఇక కుదరదు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే ఇకపై కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. అలాగే గూగుల్ డయలర్ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే అవతలి వ్యక్తికి కూడా ఈ కాల్ రికార్డు చేస్తున్నారనే అలర్ట్ వస్తుంది.అయితే కాల్ రికార్డింగ్‌కు సంబంధించి గూగుల్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. ఆండ్రాయిడ్‌లో కాల్ రికార్డింగ్‌ను నిలిపివేయాలని గూగుల్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం
ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నది గూగుల్ ఇప్పటికే చాలా సందర్బాల్లో గుర్తుచేసింది. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది.ఆండ్రాయిడ్ 6 ఓస్ తెచ్చినప్పుడు ఈ యాప్స్‌పై తొలిసారి వేటు వేసింది. కాల్ రికార్డింగ్‌కు వీలు కల్పించే ఏపీఐని తొలగించింది. అయితే.. యాప్ డెవలపర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. సరికొత్తగా మళ్లీ కాల్ రికార్డింగ్ యాప్స్ తీసుకురాగా ఆండ్రాయిడ్ 9 ఓఎస్‌లో వాటినీ అడ్డుకుంది. అయితే.. ఆండ్రాయిడ్ యాక్సెసబిలిటీ ఏపీఐని ఉపయోగించి కొందరు యాప్ డెవలపర్స్ మళ్లీ కాల్ రికార్డింగ్ ఆప్షన్ తీసుకురాగా దీనిపై వేటు వేయడానికి సిద్దమైంది గూగుల్