Bring My Flowers : లక్షల జీతాన్ని వదిలేసి పూలు అమ్ముతూ.. నెలకు 7 లక్షలు సంపాదిస్తున్న జంట
Bring My Flowers : చాలామంది కార్పొరేట్ జాబ్స్ చేసేవాళ్లు.. చిరాకు వచ్చి.. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక.. లక్షల జీతాన్ని కూడా వదిలేసి ఇంటి బాట పడుతున్నారు. లేదంటే ఏదైనా సొంతంగా బిజినెస్ చేసి.. ఉద్యోగంలో సంపాదించిన దానికన్నా ఎక్కువే సంపాదిస్తున్నారు. అలా ఎంతో మంది సక్సెస్ స్టోరీలను మనం చూశాం. వాళ్ల నుంచి ఎంతో కొంత స్ఫూర్తి పొందుతున్నాం.
తాజాగా గుర్గావ్ కు చెందిన ఓ జంట కూడా ఇలాగే తమ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసింది. 2016లో కార్పొరేట్ ఉద్యోగం మీద విరక్తితో అమిత్ త్రిపాఠి, పూజ ఇద్దరూ తమ ఉద్యోగానికి రాజీనామా చేసి.. వీక్లీ ప్లవర్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ ను ప్రారంభించారు.
Bring My Flowers : వీక్లీ ప్లవర్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ అంటే?
చాలామందికి ఇంట్లో పువ్వులను పెట్టుకోవడం ఇష్టం. ఇంట్లో పువ్వులు ఉంటే.. ఆ పువ్వుల నుంచి వచ్చే సువాసన వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది. అందుకే.. చాలామంది ఫ్రెష్ పువ్వులను మార్కెట్ నుంచి కొనుక్కొని వచ్చి.. ఇంట్లో అలంకరిస్తుంటారు. ఉద్యోగస్తులైతే ప్రతి ఆదివారం.. లేదా ప్రతి శని, ఆదివారాల్లో తమ ఇంటిని ఖచ్చితంగా రకరకాల పువ్వులతో అలంకరిస్తుంటారు.
అమిత్, పూజ కూడా ఆ కోవలోకి చెందిన వాళ్లే. వాళ్లకు కూడా ప్రతి వీకెండ్ లో ఇంట్లో పువ్వులను అలంకరించడం అంటే చాలా ఇష్టం. వాళ్లు ఉద్యోగాలు చేస్తున్న సమయంలో ప్రతి శుక్రవారం రాత్రి.. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో.. మార్కెట్ కు వెళ్లి ఫ్రెష్ పువ్వులను కొనుక్కొని.. ఆ వారాంతంలో ఆ పువ్వులను ఇంట్లో అలంకరించుకొని.. వాటి వాసనను ఇల్లు మొత్తం వ్యాపించేలా చేసేవారు.
ఇలా.. ప్రతి వారం మార్కెట్ కు వెళ్లి.. పువ్వులు కొనడం వాళ్లకు కొంచెం ఇబ్బందిగా మారింది. తమలా చాలామంది పువ్వులను మార్కెట్ కు వెళ్లి కొనుక్కోవడానికి ఇబ్బంది పడతారు కదా.. అనే ఆలోచన వాళ్లకు ఒక రోజు వచ్చింది. ఒకవేళ మనమే.. వాళ్లు మార్కెట్ కు రాకున్నా.. ప్రతి వారం ఇంటికి ప్రెష్ ఫువ్వులను డోర్ డెలివరీ చేస్తే బెటర్ కదా.. అనే ఆలోచన నుంచి పుట్టిందే బ్రింగ్ మై ఫ్లవర్స్ అనే సంస్థ.
బ్రింగ్ మై ఫ్లవర్స్ ను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు.. వాళ్లకు 21 మంది కస్టమర్లు మాత్రమే ఉండేవారు.. తర్వాత దీని గురించి అందరికీ తెలిసి.. ప్రస్తుతం వీళ్లకు 4000 మంది కస్టమర్లు ఉన్నారు.
కస్టమర్లందరికీ.. వాళ్లకు కావాల్సినప్పుడుల్లా.. జస్ట్ ఒక్క మెసేజ్ కానీ.. ఫోన్ కాల్ చేసినా వెంటనే వాళ్ల ఇంటికే ప్రెష్ పువ్వులను పంపిస్తుంది ఈ జంట. ప్రతి వారం వాళ్లకు ఉన్న యాక్టివ్ సబ్ స్క్రైబర్స్ కు టంచనుగా.. ఇంటి వద్దకే పువ్వులను పంపిస్తారు.
ఇలా.. ప్రస్తుతం ఉన్న 4 వేల మంది కస్టమర్లతో నెలకు సుమారు 7 లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నారు.