Journalism : పత్రికలకు గుడ్ బై చెబుతున్న జర్నలిస్టులు.. వాళ్లు కలం వదిలేయడం వెనుక ఉన్న కథ ఏంటి?
Journalism : జర్నలిజం లేదా పాత్రికేయం అనేది ప్రజలకు ఒక భరోసా. ఎందుకంటే.. ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను, నష్టాలను ప్రపంచానికి, ప్రభుత్వానికి, అధికారులకు తెలిసేలే చేసేదే జర్నలిజం. కానీ.. ఒకప్పుడు జర్నలిజంలా లేదు నేటి జర్నలిజం. అంతటా అవినీతి రాజ్యమేలుతున్న ఈరోజుల్లో పత్రికలు కూడా ప్రభుత్వాలకు, వ్యక్తులకు దాసోహం అంటున్నాయి. దీంతో నిఖార్సయిన వార్తలు రాసే స్వేచ్ఛ నేడు ఏ జర్నలిస్టుకు లేదు. ప్రస్తుతం జర్నలిజంలో సంక్షోభం మొదలైందని అంటున్నారు. కేవలం రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ.. కొందరు వ్యక్తులకు, ప్రభుత్వాలకు కొమ్ముకాస్తూ నడిపిస్తున్న
పత్రికల్లో పని చేసేందుకు నిఖార్సయిన జర్నలిస్టులు సుముఖత చూపడం లేదు.ధైర్యంగా కొందరు వాస్తవాలు రాయడానికి ప్రయత్నించినా అది కుదరడం లేదు. అందుకే జర్నలిజానికే గుడ్ బై చెబుతున్నారు కొందరు జర్నలిస్టులు. జర్నలిజం విలువలను దిగజార్చడం కంటే ఆ వృత్తిని వదిలేయడమే మేలు అని అనుకుంటున్నారు నేటి జర్నలిస్టులు. మరికొందరు మాత్రం పొట్ట కూటి కోసం, కుటుంబ పోషణ కోసం తప్పని పరిస్థితుల్లో తమ మనసు చంపుకొని ఆ వృత్తిలో కొనసాగాల్సి వస్తోంది. నేడు రోజూ కూలీకి కనీస వేతనం లభిస్తోంది. కానీ.. ఒక జర్నలిస్ట్ వేతనం కూలీ కన్నా తక్కువగా ఉంది.
Journalism : కూలీ కన్నా అధ్వానంగా తయారైన జర్నలిస్టు బతుకు
అంతకంటే అధ్వానంగా తయారైంది. నమ్ముకున్న వృత్తి కనీసం కూడు కూడా పెట్టకపోతే వాళ్లు ఏం చేయాలి. అటు గౌరవం లేదు.. ఇటు వేతనం లేదు.. చివరకు నిజాయితీగా పనిచేసే స్వేచ్ఛ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంకా జర్నలిజంలో ఉండాలి. ఈ వృత్తిలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది జర్నలిస్టులను వేధిస్తోంది. పాలకుల చేతి నుంచి జర్నలిజానికి స్వేచ్ఛ లభించినప్పుడే ఈ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలా ప్రజలను కాపాడుతున్న జర్నలిజానికి విలువ దక్కుతుంది. లేదంటే జర్నలిజం అనే మాటే భవిష్యత్తులో వినబడదు.