కేసీఆర్ ఈటల యుద్ధంలో ఆఖరి అస్త్రం : వన్ అండ్ ఓన్లీ
తెరాస నుండి దాదాపుగా బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అంటూ అందరి నేతలతో మంతనాలు సాగిస్తున్నాడు. హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే తనకి కుడి ఎడమలుగా కాంగ్రెస్ బీజేపీ నిలబడి తనను విజయతీరాలను చేర్చాలని కోరుకుంటున్నాడు, రెండు భిన్న ధ్రువాలు కలిసి ఈటలకు మద్దతు ఇస్తాయని అనుకోవటం అత్యాశే అవుతుంది. అంత ఈజీగా జరిగే పని కాదని తెలుస్తుంది. మరోపక్క ఈటల స్వయంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విధంగా కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
రంగంలోకి హరీష్ రావు
ఈటల మీద మరో అస్త్రాన్ని ప్రయోగించడానికి టీఆర్ఎస్ అధినేత సిద్దమవుతున్నారని సమాచారం. తెరాసలో పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన హరీష్ రావు ను ఈ విషయంలో ఇన్వాల్ చేయాలనీ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కొంచము ఆలస్యం అయినాగానీ హుజురాబాద్ లో ఉప ఎన్నిక మాత్రం అనివార్యం. ఈటల లాంటి నేత పైగా సొంత గడ్డ కాబట్టి స్థానిక బలం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈటలను తట్టుకొని నిలబడాలంటే హరీష్ రావు లాంటి కీలకనేత వ్యూహాలు చాలానే అవసరం
కేటీఆర్ ను తప్పించించటం వెనుక వ్యూహమేంటి?
నిజానికి హుజురాబాద్ లో ఉప ఎన్నికలు జరిగితే వాటి బాధ్యతను మంత్రి కేటీఆర్ కు అప్పగించాలని కేసీఆర్ భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈటల లాంటి బలమైన నేతను ఢీ కొట్టే సమయంలో ఏమైనా జరగవచ్చు. ఒక వేళా సామదానభేద దండోపాయాలు ఉపయోగించిన తెరాస గెలవకపోతే దానికి బాధ్యత కేటీఆర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇలాంటి సమయంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలితే కేటీఆర్ నాయకత్వం మీదే అనుమానం వచ్చే అవకాశం ఉందని భావించి, అతని స్థానంలో హరీష్ రావు ను దించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది.
కేసీఆర్ ను ఎదిరించి నిలిచేనా..!
తెరాస పార్టీ నుండి బయటకు వచ్చిన నేతలెవరూ రాజకీయ చదరంగంలో గట్టిగా నిలబడిన దాఖలాలు కనిపించటం లేదు. జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డి. శ్రీనివాస్ వంటి వారు రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యాన్ని కొల్పోయారు. ఉద్యమ పార్టీగా మొదలైన తెరాస ప్రస్థానం నేడు పూర్తి రాజకీయ పార్టీగా మారిపోయింది. ఉద్యమ తరుపున వాటాలు అడిగే నేతలందరూ దాదాపుగా కనుమరుగైయ్యారు. ఆ కోటాలో ఉన్న ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు ఆ పార్టీ నుండి వెళ్లిపోయాడనే చెప్పాలి. ఇక చెప్పాలంటే కేసీఆర్ మాటకు విలువిస్తూ ఆయన చెప్పుచేతల్లో మసులుకునే నేతలు మాత్రమే అక్కడ వున్నారు..