KCR : పోలవరంపై కేసిఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ.! అసలు నిజం ఇదేనా.?
KCR : అదేదో క్లౌడ్ బరస్ట్ వల్ల, విదేశీ కుట్ర వల్ల భద్రాచలం ముంపుకు గురయ్యిందంటూ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఇప్పుడెందుకు పోలవరం ప్రాజెక్టుని భద్రాచలం ముంపుకు కారణంగా చూపిస్తున్నట్లు.? తెలుగునాట రాజకీయాల్లో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అయిపోయింది. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు పరస్పరం తీవ్రస్థాయి ఆరోపణలే చేసుకుంటున్నారు.
హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని అంశం దగ్గర్నుంచి, ఒకప్పుడు భద్రాచలం ఆంధ్రాలో వుండేదన్న వ్యవహారం దాకా.. చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంశం తెరమరుగైపోయింది. ‘హమ్మయ్య..’ అంటూ గులాబీ శ్రేణులూ ఊపిరి పీల్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీ, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి పూర్తి సహకారం అందించినట్లే కనిపిస్తోంది.పోలవరం ముంపుపై రీ-సర్వే జరగాలని తెలంగాణ అంటోందిగానీ, అందులో చిత్తశుద్ధి లేదు. అది జరిగే పని కూడా కాదు.
అది వైసీపీకి కూడా తెలుసు. తెలంగాణకీ తెలుసు ఆ విషయం. ముంపు మండలాలు తిరిగి రావు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కూడా తగ్గదు. ఇప్పట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవదు గనుక, ప్రాజెక్టు వల్ల ముంపు అనేది సాధ్యమయ్యే పని కాదు. రాజకీయ యెత్తుగడల్లో భాగంగా పోలవరం అంశం ప్రస్తుతం తెరపైకొచ్చింది. కొన్నాళ్ళ తర్వాత అంతా మామూలే. క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంశంతో కేసీయార్ మీద ట్రోలింగ్‌కి దిగేందుకు ప్రయత్నించిన బీజేపీ, కాంగ్రెస్ అనూహ్యంగా పోలవరం అంశం తెరపైకొచ్చేసరికి మిన్నకుండిపోయాయి. అదే కేసీయార్ కోరుకున్నది కూడా.