Komatireddy : ఈటెల బాటలో.. బీజేపీ కీలక నేతతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ..?
Komatireddy : బీజేపీలోకి వెళతానంటూ ఎప్పటి నుంచో చెబుతున్న నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(కాంగ్రెస్) ఈ మేరకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కమలం గూటి నుంచి అధికారికంగా ఆహ్వానం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నట్లుగా ఉన్న ఆయనకి ఎట్టకేలకు అది కూడా పూర్తయింది. దీంతో రాజగోపాల్ రెడ్డి రాజకీయ వేదిక త్వరలో మారనున్నట్లు సమాచారం. ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ ఆయన్ని లేటెస్టుగా కలిశారు. కాషాయం పార్టీ తీర్థం పుచ్చుకోవాలని లాంఛనంగా కోరారు. ఇప్పటివరకు ఈ పిలుపు కోసమే ఆగిన ఈ కోమటిరెడ్డి బ్రదర్ అరుణ ఇన్విటేషన్ కి పాజిటివ్ గా స్పందించినట్లు చెబుతున్నారు. తన నిర్ణయాన్ని కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు.
ఆయన తర్వాతే..
తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో నాలుగు రోజుల్లో (ఈ నెల 11వ తేదీన లేదా ఆ తర్వాత) బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా అదే బాటలో నడవనున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి సరైన ప్రత్యామ్నాయం కమలం పార్టీయేనని ఈయన గతంలోనే తేల్చిచెప్పారు. కాబట్టి హస్తం పార్టీకి గుడ్ బై కొట్టడానికి ఇక కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లేనని భావించొచ్చు. ఈటల అంతటివాడే సీఎం కేసీఆర్ ని ఢీకొట్టడానికి కాషాయం పంచన చేరుతుండటం రాజగోపాల్ రెడ్డికి మరింత ఉత్సాహానిస్తోంది.
‘బండి’ వల్లే.. : Komatireddy
నిజం చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడో ఈ పని చేయాల్సి ఉంది. కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వల్లే లేటైనట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు మూడు నెలల కిందట ఈయన తాను కమలం పార్టీలోకి వెళ్లనున్నట్లు తిరుపతిలో ప్రకటించారు. ఇదే విషయాన్ని బండి దగ్గర ప్రస్తావిస్తే ‘ఏమో.. ఆ సంగతి ఆయన్నే అడగండి’ అంటూ కాస్త వెటకారంగా అన్నారు. ఈటల విషయంలోనూ బండి మొదట్లో కొంచెం ప్రతికూలంగానే స్పందించారు. తర్వాత కిషన్ రెడ్డి జోక్యంతో అంతా సాఫీగా పూర్తవుతోంది. టీపీసీసీ చీఫ్ పోస్ట్ కోసం రేవంత్ రెడ్డితో పోటీ పడుతున్న రాజగోపాల్ రెడ్డి అన్న వెంకట్ రెడ్డి కూడా అతి త్వరలో వార్తల్లో నిలవనున్నారు.