KTR vs Revanth Reddy : శశిథరూర్ కోసం.. వీళ్లిద్దరు కొట్టుకోవడం ఏంటి? దేనికోసం ఈ ట్విట్టర్ వార్?
KTR vs Revanth Reddy కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సీనియర్ నేతతో వివాదానికి తెరదించే ప్రయత్నించారు. కాగా, కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రశంసిస్తూ శశిథరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శశిథరూర్‌పై రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, అది తప్పుడు ప్రచారమని రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయడంతో.. మంత్రి కేటీఆర్.. ఆ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఇందులో శశిథరూర్‌ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నట్లుగా ఉంది.
ఆ ఆడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి.. ఎంపీ శశిథరూర్‌కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శశిథరూర్ స్పందించారు. రేవంత్ రెడ్డి చింతిస్తున్నట్లు తెలిపారని, తాను అంగీకరించినట్లు శశిథరూర్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందన్నారు. తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతం కావడానికి తామందరం ఒక్కటిగా కలిసిపనిచేస్తామన్నారు. ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ను రేవంత్ రెడ్డి గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థర్డ్ రేట్ క్రిమినల్ కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
శశి థరూర్ పై రేవంత్ వ్యాఖ్యలు KTR vs Revanth Reddy
ఇటీవల ఐటి స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ హైదరాబాదులో తన బృందంతో పర్యటించారని, ఐటి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారని పేర్కొన్నారు. తనకు చెప్పకుండా వచ్చారని శశిధరూర్ ను గాడిద అంటూ వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ రెడ్డి తీరు పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదని, ఇక ఈ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించినప్పుడు ఆయన శశిధరూర్ పై మండి పడ్డాడని, గాడిద అంటూ సంబోధించారని ఓ పత్రిక వార్త ప్రచురించింది. త్వరలోనే పార్టీ ఆయనను బహిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లుగా ఆ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది.
అంతేకాదు శశిధరూర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే తరహా మనుషులు అని రేవంత్ రెడ్డి అన్నారని, ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన మేధావులం అని భావించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా పత్రిక ప్రచురించింది. ఇక దీనిపై తీవ్రస్థాయిలో మండిపడిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి థర్డ్ రేట్ క్రిమినల్ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్ ద్వారా వివరణ ఇస్తూ.. పుట్టుకతోనే అబద్ధాలకోరు అయిన కేటీఆర్.. రాష్ట్రంలోని పరిణామాలు, తన కుటుంబంపై అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.