Education : చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలా.. ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట పడదా .. ?
ప్రధానాంశాలు:
Education : చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాలా.. ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట పడదా .. ?
Education : ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ ప్రైవేట్ స్కూల్లో ఫీజు దోపిడీకి వేటు ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. ఇంటర్నేషనల్ స్కూల్లో నర్సరీ కి మూడు లక్షలు, ఎల్కేజీకి నాలుగు లక్షలు వసూలు చేస్తున్నారు. క్లాస్ పెరిగే కొద్దీ ఫీజులు తడిసి మోపడవుతున్నాయి. ప్రభుత్వ చర్యలు లేక ప్రైవేట్ యాజమాన్యాలు దోచుకుంటున్నాయి. చదువులు కొనలేక తల్లిదండ్రులు విలవిలాడుతున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసేవ పేరుతో రంగంలోకి వచ్చి ప్రైవేట్ సంస్థలు వచ్చిన కాడికి దోచుకుంటున్నాయి. స్టూడెంట్స్ వ్యాపార సరుకుగా కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. పేదలు మధ్యతరగతి వాళ్లు పిల్లల్ని చదివించడానికి తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఎడ్యుకేషన్ సరిగా ఉండదని తల్లిదండ్రులు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ప్రైవేటు స్కూల్స్లో జాయిన్ చేపిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ సంస్థలు దోచుకుంటున్నాయి.
హైదరాబాదులో ఒక స్కూల్లో ఎల్కేజీకి 2 లక్షల 30 వేల ఫీజు ఉండగా వచ్చే సంవత్సరానికి 3 లక్షల 70 వేలకు పెంచేసింది. ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫామ్ అంటూ బాదుడుకు లెక్కలేదు. పుస్తకాలు మా దగ్గరే కొనాలని కండిషన్ పెడుతూ డబ్బులు వెనకేసుకుంటున్నాయి. మరోవైపు డీజిల్ ధర పెరిగిందని స్కూల్ బస్సు ఫీజులను పెంచుతున్నారు. దీనితో పేదవాడికి ప్రైవేట్ ఫీజు తడిసి మోపెడవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన అంతమాత్రంగానే చదువు సాగుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సౌకర్యాలు కూడా అంతగా లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతున్నారు. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ స్కూల్స్ కాసులను రాబట్టుకుంటున్నాయి. ఇలాంటి స్కూల్స్ పై రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి ఉండదు. ప్రాతిపదిక హేతుబద్ధత ఉండదు. ఇలాంటి స్కూల్స్ పై గతంలో హైకోర్టు సీరియస్ అయింది. వన్ టైం ఫీజు కింద ఏడు లక్షల నుంచి పది లక్షలు వసూలు చేస్తుండడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక ప్రైవేట్ స్కూల్స్ పైన పటారం లోన లోటారంలాగా కనిపిస్తాయి. ప్రభుత్వం నిబంధనలను పాటించని స్కూల్స్ ఎన్నో ఉన్నాయి.
కొన్ని పాఠశాలలకు ల్యాబ్స్, కంప్యూటర్స్, టాయిలెట్ సరిగా ఉండవు. ఉదయం ప్రేయర్ కు స్థలం కూడా ఉండదు. విశాలమైన తరగతి గదులు కూడా ఉండవు. క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉండరు. అలాంటి స్కూల్స్ కి ప్రభుత్వ అనుమతి ఇవ్వడం బాధాకరం. డబ్బులు ఖర్చు చేసి ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ తీసుకుంటున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ పై ప్రభుత్వం నిబంధన లేదనేది స్పష్టం అవుతుంది. ఫీజులు నియంత్రణపై ప్రభుత్వం ఎన్నో జీవోలను తీసుకొచ్చింది. ఎన్నో రూల్స్ పెట్టింది. అయినా ప్రైవేట్ విద్యాసంస్థలు వాటిని పాటించడం లేదు. ప్రభుత్వమే కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట పడదు. ఇది ఇలానే కొనసాగితే ప్రతి గల్లీకి 10, 20 స్కూళ్లు తయారవుతాయి. ఇప్పటికే ఒక గల్లీకి మూడు, నాలుగు స్కూళ్లు వెలుస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట పడకపోతే ఇలాంటి స్కూల్స్ ఎన్నో వస్తాయి. ప్రభుత్వం ఇలాంటి స్కూల్స్ కి గుర్తింపు ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యను అందించాలి కొన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కూడా సరిగా ఉండవు. ఇలాంటి క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తూ రెక్కల ముక్కలు చేసుకుంటున్నారు.