Red Chilli Chicken : రెస్టారెంట్ స్టైల్ రెడ్ చిల్లి చికెన్… ఇలా చేసి చూడండి…
Red Chilli Chicken : నాన్ వెజ్ లలో చికెన్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. చికెన్ ను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. చికెన్ వివిధ రకాల స్టైల్లో చేస్తూ రుచులను ఆస్వాదిస్తూ ఉంటారు. ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు రెడ్ చిల్లి చికెన్ తినే ఉంటాం. ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్ రెడ్ చిల్లి చికెన్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: 1) చికెన్ 2) తెల్ల మిరియాల పొడి 3) గుడ్డు 4) ఉప్పు 5) కార్న్ ఫ్లోర్ 6) మైదాపిండి 7) ఆయిల్ 8) వెల్లుల్లి 9) అల్లం 10) పచ్చిమిర్చి 11) ఉల్లిపాయ 12) కరివేపాకు 13) కారంపొడి 14) టమాటో కెచప్ 15) రెడ్ చిల్లి సాస్ 16) ఫుడ్ కలర్ 17) జీడిపప్పు. తయారీ విధానం : ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఒక గుడ్డును పగలగొట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ తెల్ల మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ మైదాపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ చికెన్ ముక్కలను నూనెలో వేయించుకోని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి అయ్యాక వన్ టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి.
తర్వాత ఇందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు వేసి కొద్దిగా వేగనిచ్చాక ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులో రెండు టీ గ్లాసులు వాటర్ను పోసుకొని అర టీ స్పూన్ కారంపొడి, అర టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి, ఒకటిన్నర టీ స్పూన్ టొమాటో కెచప్ ఒకటిన్నర టీ స్పూన్ రెడ్ చిల్లి సాస్, పావు టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను వేసి చాలాసేపు కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన రెడ్ చిల్లి చికెన్ రెడీ.