Medak : టీఆర్ఎస్ కు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ షాక్.. పార్టీ జెడ్పీటీసీ రాజీనామా
Medak : టీఆర్ఎస్ పార్టీలో భారీ కుదుపు ఏర్పడింది. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి వెంటనే వారిని పార్టీ అధిష్ఠానం మళ్లీ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. ఆ ఘటన జరిగి రెండు రోజులు కూడా కాకముందే.. మెదక్ జిల్లా నుంచి మరో షాక్ తగిలింది పార్టీకి. నర్సాపూర్ నియోజకవర్గంలోని చిల్పిచెడ్ మండలం జెడ్పీటీసీ శేషసాయిరెడ్డి.. తన పదవికి రాజీనామా చేశారు. తన పదవితో పాటు.. టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు.
శేషసాయిరెడ్డి ఎవరో కాదు.. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సొంత అన్నకొడుకు. అయితే.. ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. తన నియోజకవర్గంలోని నేతలపై కాస్త దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. పార్టీ నేతలు ప్రోటోకాల్ కూడా పాటించకుండా.. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మనస్థాపం చెందిన శేషసాయిరెడ్డి.. తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
నిజానికి.. నర్సాపూర్ నియోజకవర్గం.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. తమ కంచుకోట అయిన నర్సాపూర్ మీద కాంగ్రెస్ పార్టీ కన్ను పడింది. ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి.. నర్సాపూర్ మీద ఫోకస్ పెట్టారు. ఈనేపథ్యంలోనే శేషసాయిరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శేషసాయిరెడ్డి.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.