TRS : టీఆర్ఎస్ తో కటీఫ్… పురపాలక ఎన్నికల వేళ కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చిన కీలక నేత?
TRS : తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ల మీద ఝలక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి పాలు అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. తాజాగా పురపాలక ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ కు ఝలక్ ఇచ్చింది టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం పార్టీ. నిజానికి.. ఈ రెండు పార్టీలు కలిసి ఎక్కడా పోటీ చేసింది లేదు కానీ… రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయి. సీట్లను సద్దుబాటు చేసుకుంటాయి. ఓల్డ్ సిటీలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా… ఎంఐఎంకు మద్దతు ఇస్తుంది. అలాగే… కొన్ని చోట్ల ఎంఐఎం పార్టీ కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుంది. అలాగే… సీఎం కేసీఆర్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు.
అసదుద్దీన్ ఏది చెప్పినా కేసీఆర్ కాదనరు. వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది అని టీఆర్ఎస్ పార్టీలో కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే… ఆ బంధం ఇప్పుడు చెడినట్టు కనిపిస్తోంది. పురపాలక ఎన్నికల వేళ అసదుద్దీన్ సీఎం కేసీఆర్ కు ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే… మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా… జడ్చర్లలో ఇటీవల అసదుద్దీన్ చేసిన ప్రసంగం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ అయింది.
త్వరలోనే తెలంగాణలో రెండు మునిసిపల్ కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓవైపు కరోనా ఉన్నా… కరోనా జాగ్రత్తలు పాటిస్తూ… ప్రధాన పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయి. తాజాగా జడ్చర్లలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అసద్… సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశం అయ్యాయి.
TRS : 2023 లో టీఆర్ఎస్ పార్టీకి వడ్డీతో సహా చెల్లిస్తాం
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చాం. మా మద్దతుతో అప్పుడు ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ… ప్రస్తుతం మమ్మల్ని, మా పార్టీని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. జడ్చర్లలో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తోంది. అయితే… టీఆర్ఎస్ పార్టీ నేతలు.. జడ్చర్లలో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు. మీరు అంత దూరం వెళ్తే… మేం కూడా వెళ్తాం. 2023 ఎన్నికల్లో మీకు వడ్డీతో సహా చెల్లిస్తాం.. అంటూ అసదుద్దీన్ మండిపడ్డారు. అసదుద్దీన్ మాటలను చూస్తుంటే… టీఆర్ఎస్ పార్టీతో ఎంఐఎం పార్టీ కటీఫ్ చేసుకున్నట్టే అని అనిపిస్తోంది. అందుకే అసద్ అలా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే… ఎంఐఎం పార్టీ భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వదా? ఒకవేళ ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.