Raghu Ramakrishna Raju : కేంద్ర మంత్రిగా రఘురామనా…?
Raghu Ramakrishna Raju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి, కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అందుకేనేమో వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైతం లెక్కచేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అఫ్ కోర్స్ దానికి తగ్గట్లే రాజు గారికి సన్మానం జరిగిందనుకోండి. అది వేరే విషయం. ఆఫ్ట్రాల్ ఒక ఎంపీకే అంతుంటే ఇక ఏకంగా ఒక రాష్ట్రాన్నే ఏలుతున్న వ్యక్తికి ఇంకెంత ఉండాలి అని ఏపీలోని రూలింగ్ పార్టీ అడుగుతోంది. అయితే ఏపీ, సెంట్రల్ పాలిటిక్స్ కి సంబంధించిన ఈ ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరగబోతోందనే టాక్ వినిపిస్తోంది.
ఆ ఛాన్సేదో ఆయనకే ఇస్తే పోలా?..
బీజేపీకి ఏపీ నుంచి నేరుగా ప్రజల ద్వారా ఎన్నుకున్న ఎంపీలెవరూ లేరు. రాజ్యసభకు నామినేట్ అయినవాళ్లు మాత్రం ఉన్నారు. సురేష్ ప్రభు, నిర్మలాసీతారామన్, జీవీఎల్ నరసింహారావుతోపాటు టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన నలుగురు ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. మిగతా ముగ్గురిలో నిర్మలా సీతారామన్ ఇప్పుడు కేంద్రమంత్రి పదవిలోనే ఉన్నారు. సురేష్ ప్రభు మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడు ఆయన కేబినెట్ లో మంత్రిగా చేశారు. ఇక జీవీఎల్ నరసింహారావుకి సామాజిక వర్గం ప్రధాన ప్రతికూల అంశంగా మారినట్లు చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ పోను ఇక బీజేపీకి అనధికారికంగా మిగిలింది రఘురామకృష్ణరాజు మాత్రమే. అందుకే అతణ్ని కేంద్ర మంత్రి పదవితో మరింత ప్రోత్సహిస్తే బాగుంటుందనే సూచనలు, సలహాలు వస్తున్నాయంట.
వాళ్ల రాజకీయం అదే కదా.. : Raghu Ramakrishna Raju
బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న రాజకీయాన్ని ప్రజలు చూస్తున్నారు కదా. వేరే పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలోకి లాక్కోవటం లేదా స్వచ్ఛందంగా వాళ్లే వచ్చేలా చూడటం, అనంతరం పదవులిచ్చి పనిచేయించుకోవటం విధితమే. రఘురామకృష్ణరాజు కూడా తన వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఓసారి అన్నారు. వైఎస్సార్సీపీని బెదిరించటం కోసం అలా మాట్లాడారు. ఏపీలోని బీజేపీ ఎలాగూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్ గా ఏమీ చేయలేకపోతోంది. కాబట్టి కొద్దోగొప్పో హడావుడి చేసే రఘురామకృష్ణరాజుకు ప్రమోషన్ ఇస్తే తమ పార్టీకి ఫ్యూచర్ లో ప్లస్ అవుతుందని బీజేపీ అనుకుంటోందట. దీంతో ఏపీ నుంచి తెలంగాణకు, అక్కడి నుంచి మూడో కంటోడికి తెలియకుండా ఢిల్లీకి చేరుకున్న రఘురామకృష్ణరాజు రేప్పొద్దున కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసి ఆంధ్రప్రదేశ్ కి అట్టహాసంగా వస్తాడేమో చూడాలి.