One Rupee Hospital : ఒక్క రూపాయికే వైద్యం.. హైదరాబాద్ నడిబొడ్డున కార్పొరేట్ ఆసుపత్రి సేవలు.. క్యూ కడుతున్న జనం… వీడియో
One Rupee Hospital : సాధారణంగా జ్వరం వచ్చినా ఏదైనా చిన్ని ఆసుపత్రికి వెళ్లినా.. వందలకు వందలు ట్రీట్ మెంట్ పేరుతో డాక్టర్లు గుంజుతుంటారు. ఆ తర్వాత మెడిసిన్ కోసం కూడా అంతో ఇంతో ఖర్చు పెట్టాలి. మరి.. ఖరీదైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే ఇక అంతే సంగతులు. మన పర్సు మొత్తం ఖాళీ కావాల్సిందే. ఉన్నదంతా అమ్ముకోవాల్సిందే. కానీ.. ఈ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే.. కేవలం మీ జేబులో రూపాయి ఉంటే చాలు. అన్ని ట్రీట్ మెంట్స్ చేయించుకోవచ్చే. కేవలం రూపాయితో డాక్టర్ల అపాయింట్ మెంట్ కూడా దొరుకుతుంది. అది కూడా ఏదో చిన్న ఆసుపత్రి అనుకునేరు. హైదరాబాద్ నడిబొడ్డున రామ్ నగర్ లో
ఉన్న జీజీ ఛారిటబుల్ హాస్పిటల్ అది. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి జనాలు క్యూ కడుతున్నారు. ఎందుకంటే.. లక్షలు పోసినా తగ్గని రోగానికి.. ఇక్కడ కేవలం రూపాయికే అనుభవం గల డాక్టర్లు తగ్గిస్తున్నారు. పేదలందరికీ తక్కువ ధరకే ఖరీదైన వైద్యం అందించాలన్న గొప్ప సంకల్పంతో ఈ ఆసుపత్రిని గంగాధర్ గుప్తా అనే వ్యక్తి నిర్మించారు. అక్కడ రూపాయికే వైద్యం మాత్రమే అందించడం కాదు.. ఆసుపత్రిలో చేరిన వారికి ఫ్రీ బెడ్, ఫ్రీ భోజనం, పేషెంట్ తో పాటు వచ్చిన వాళ్లకు కూడా ఉచితంగా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన వాళ్లకు చేసే పలు టెస్టులకు మాత్రం ఈ ఆసుపత్రిలో కొంత మేర ఫీజు తీసుకుంటున్నారు.
One Rupee Hospital : టెస్టులకు మాత్రం చాలా తక్కువ ఫీజు వసూలు చేస్తున్న ఆసుపత్రి
అది కూడా టెస్టుల కోసం తీసుకునే అతి తక్కువ ఫీజు. బయట ఆసుపత్రుల్లో అది ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఇక్కడ చాలా తక్కువ ధరకు టెస్టులు, మెడిసిన్ కూడా 50 శాతం డిస్కౌంట్ తో అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి ఆదరణ పెరిగింది. జనాలు కూడా ఆసుపత్రి ముందు క్యూ కడుతున్నారు. రోజూ వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఇంకా మరిన్ని సేవలను తీసుకొచ్చి ఆసుపత్రిని విస్తరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. ఏది ఏమైనా.. ఈ సమయంలో.. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయికే వైద్యం అందించడం అనేది అసాధ్యం. కానీ.. దాన్ని సుసాధ్యం చేసిన ఆసుపత్రి యాజమాన్యానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే.