Panchayat Elections : నువ్వు ఓటు వేయడం వల్లే ఒక్క ఓటుతో నేను ఓడిపోయాను… వృద్ధురాలి ప్రాణాలు తీసిన వేధింపులు..!
ప్రధానాంశాలు:
Panchayat Elections : నువ్వు ఓటు వేయడం వల్లే ఒక్క ఓటుతో నేను ఓడిపోయాను... వృద్ధురాలి ప్రాణాలు తీసిన వేధింపులు..!
Panchayat elections : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మొనారి రాధమ్మ (61) ఇటీవల తన కుటుంబంతో కలిసి సమీపంలోని రంగాపూర్ గ్రామానికి నివాసం మార్చుకుంది. అయితే ఆమె ఓటు హక్కు మాత్రం పాత గ్రామమైన గొల్లపల్లిలోనే కొనసాగింది. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాధమ్మ గొల్లపల్లిలోనే తన ఓటు హక్కును వినియోగించింది. ఇది ఆమెకు చట్టబద్ధమైన హక్కే అయినప్పటికీ అదే ఆమె జీవితాన్ని బలితీసుకునే పరిస్థితికి దారితీసింది. గొల్లపల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కలబోయిన నరేందర్ ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన ఓటమికి కారణం గ్రామం మారినా ఓటు హక్కు అక్కడే ఉంచుకున్న వారేనని భావించాడు. ఈ క్రమంలోనే రాధమ్మతో పాటు మరో ఇద్దరిపై పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
Panchayat Elections : నువ్వు ఓటు వేయడం వల్లే ఒక్క ఓటుతో నేను ఓడిపోయాను… వృద్ధురాలి ప్రాణాలు తీసిన వేధింపులు..!
Panchayat elections : నోటీసులు, బెదిరింపులు.. పెరిగిన మానసిక ఒత్తిడి
సివిల్ కోర్టు నుంచి నోటీసులు అందుకున్న రాధమ్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. “నా ఒక్క ఓటుతోనే ఓడిపోయాడా?” అనే ఆలోచన ఆమెను లోపల నుండి కుదిపేసింది. ఇదిలా ఉండగా నరేందర్ సోదరుడు విజేందర్ రంగంలోకి దిగాడు. రాధమ్మ తన అన్న ఓటమికి కారణమని ఆరోపిస్తూ ఆమె కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించినట్లు తెలుస్తోంది. నీ వల్లే మా అన్న ఓడిపోయాడు మీ కుటుంబం అంతు చూస్తాం అంటూ పలుమార్లు హెచ్చరించాడని రాధమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే కోర్టు నోటీసులతో భయాందోళనలో ఉన్న వృద్ధురాలికి ఈ బెదిరింపులు తాళలేనివిగా మారాయి. సామాజికంగా పరువు పోతుందన్న భయం కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందన్న ఆందోళన ఆమెను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసింది.
Panchayat elections : ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య.. కేసు నమోదు
నిరంతర వేధింపులు బెదిరింపులు తాళలేక రాధమ్మ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక పౌరుడి ఓటు హక్కు వినియోగం కారణంగా ఒక వృద్ధురాలి ప్రాణాలు పోవడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాధమ్మ మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేందర్ అతని సోదరుడు విజేందర్ తమ తల్లిని మానసికంగా వేధించారని బెదిరింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నరేందర్ విజేందర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువపై ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ వేధింపులపై పెద్ద చర్చకు దారి తీసింది. ఓటు వేయడం పౌరుడి హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. ఆ హక్కును వినియోగించినందుకే ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని ఆలోచింపజేసే విషాద ఘటనగా మిగిలింది.