YS Sharmila : 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి వైఎస్ షర్మిల.. వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ నియామకం?
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌దే పూర్తి ఆధిపత్యం. మధ్య మధ్యలో ఇతర పార్టీలు కొంత మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్‌దే పైచేయి అని చెప్పకతప్పదు. తెలంగాణలో వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్.. రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కొంతమేర బలపడ్డ బీజేపీ, కాంగ్రెస్ కూడా అధికారం కోసం రేసులో నిలిచాయి. ఇక తీన్మార్ మల్లన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్ షర్మిల కూడా రాజ్యాధికారం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న కేసీఆర్‌ను దెబ్బకొట్టడం అంత ఈజీ కాదనే వాదన ఉంది. ఇందుకోసం కేసీఆర్‌ను మించి వ్యూహాత్మకంగా ఆలోచించే వ్యూహకర్త కావాలన్నది పలువురి అభిప్రాయం. ఇదిలా ఉంటే ఎన్నో రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టేలా వ్యూహాలు రచించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. త్వరలోనే తెలంగాణపై ఫోకస్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన వైఎస్ షర్మిల పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించనున్నారని ప్రచారం సాగుతోంది.

prashant kishor to work with ys sharmila party in telangana
వైఎస్ షర్మిల కోసం..
ఇందుకోసం ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కసరత్తు పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చి పని మొదలుపెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర కోసం వైఎస్ షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, ఫలితం దక్కడం లేదు..అందుకే ఇక అన్న వైఎస్ జగన్ బాటలో నడవాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్నపాలన తెస్తామంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. త్వరలోనే పాదయాత్ర చేయడానికి కూడా
సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు వైఎస్ షర్మిలకు ఆశించిన స్థాయిలో పొలిటికల్ మైలేజీ వచ్చిన దాఖలాలు మాత్రం పెద్దగా లేవనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగి తెలంగాణలో వైఎస్ షర్మిల సారథ్యంలో వైఎస్ఆర్‌టీపీని రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీగా మార్చనున్నారన్న టాక్ ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిశోర్ ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ కిశోర్.. తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అధికార చేజిక్కించుకునేందుకు దోహదం చేస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ప్రశాంత్ కిశోర్ వైఎస్ షర్మిల పార్టీ కోసం పని చేస్తే.. తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీ ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.