Suman Shetty | బిగ్‌బాస్ 9తో తిరిగి వెలుగులోకి వచ్చిన సుమన్ శెట్టి .. డైరెక్టర్ తేజ కామెంట్స్ వైరల్
Suman Shetty | ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 లో హౌస్‌మేట్లను నవ్విస్తూ సందడి చేస్తున్న ప్రముఖ కమెడియన్ సుమన్ శెట్టి, సినీ ప్రేక్షకులకు పరిచయం కావడం మాత్రం ఇప్పటిది కాదు. ‘జయం’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి, తనదైన హాస్యంతో అనేక చిత్రాల్లో అలరించాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా, ఇప్పుడు బిగ్‌బాస్ వేదికగా మళ్లీ తనదైన స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

#image_title
నిజంగా గ్రేట్..
“జయం సినిమాతో సుమన్ శెట్టిని పరిచయం చేశాను. ఆ సినిమా విడుదలయ్యాక అతనికి మంచి పేరు వచ్చింది. ఆ టైంలో నేనే అతనితో ‘ఇప్పుడు నీకు చాలా అవకాశాలు వస్తాయి. డబ్బులు అలా ఖర్చు చేయకూడదు. ఓ స్థలం కొనుగోలు చేసి ఇంటిని కట్టించుకో’ అన్నాను. కొన్నాళ్లకే అతను వచ్చి, ‘ఇల్లు కడుతున్నాను సర్, ఇది మీ వల్లే జరిగింది’ అంటూ నా కాళ్లు పట్టుకోవాలని చూశాడు. దాన్ని అడ్డుకుని, ‘కాళ్లు పట్టుకోవద్దు, నాకు ఎలా ఋణం తీర్చుతావో చెప్పు’ అని అన్నాను.”
“నువ్వు కట్టిస్తున్న ఇంట్లో నా కోసం ఒక రూమ్ ఉంచు. నేను ఎప్పుడూ కొత్తవాళ్లతోనే సినిమాలు చేస్తుంటాను. ఒకరోజు నేను అన్నీ పోగొట్టి రోడ్డు మీదకు రావచ్చు. అప్పుడు నాకు ఇల్లు ఉండకపోవచ్చు. కానీ నువ్వు కట్టించిన ఇంట్లో ఒక గది నాకు ఉండాలి. అదే చాలు” అని అన్నట్లు చెప్పారు. తేజ చెప్పిన ఈ మాటలను సీరియస్‌గా తీసుకున్న సుమన్ శెట్టి, నిజంగానే తన ఇంట్లో తేజ కోసం ఒక గది కట్టించి, అందులో ఆయన ఫోటో కూడా పెట్టాడట. ఇది తన జీవితంలో ఆచరణాత్మక కృతజ్ఞతకు నిదర్శనమని తేజ గుర్తుచేశారు.