Gas Subsidy : గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఎత్తేసిన కేంద్రం.. సామాన్యులపై మరింత భారం
Gas Subsidy: వంట గ్యాస్ సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గ్యాస్ సిలిండర్ పై సబ్బిడీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ పై ఇప్పటివరకు అందిస్తున్న రాయితీని నిలిపివేస్తూ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనాల్సిఉంటుంది. దీంతో సమాన్యులపై మరింత భారం పెరగనుంది. కాగా ఉజ్వల లబ్దిదారులకు మినహాయింపు ఇచ్చింది. కేంద్రం నిర్ణయంతో దేశంలో 21 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ దూరం కానుంది. గతంలో రూ.200 సబ్సిడీ రాగా భారీగా తగ్గించిన కేంద్రం చివరకి రూ.40 కొనసాగించింది.
ప్రస్తుతం ఈ సబ్సిడీని కూడా ఎత్తేసింది. ఈ మేరకు చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. ఇకమీదట ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రమే గ్యాస్ పై సబ్సిడీ లభిస్తుందని వెల్లడించారు. దేశంలో కరోనా ఉధృతి ప్రారంభమైన 2020 జూన్ నుంచి వంట గ్యాస్ పై సబ్సిడీ నిలిపివేశామని కేంద్రం వెల్లడించింది. అయితే ఉజ్వల పథకంలో కనెక్షన్ తీసుకున్న వారికి సిలిండర్ కు రూ.200 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ లభిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని,
దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.6100 కోట్ల భారం పడుతోందని కేంద్రం చెప్పింది. ప్రస్తుతం దేశంలో 300 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో ఉజ్వల కనెక్షన్లు కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే మిగిలిన 21 కోట్ల మంది మార్కెట్ రేటుకి అనుగుణంగా గ్యాస్ బండ కొనాల్సి ఉంటుంది. ఇటీవలే కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీంతో ఊపిరి పీల్చుకునేలోపే కేంద్రం సబ్సిడీ రూపంలో బాదడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.