Rains : అప్పుడేమో కోవిడ్.! ఇప్పుడేమో వర్షాలు.! ఇలాగైతే చదువులెలా.?
Rains : చినుకు పడితే రోడ్లు చిత్తడిగా మారడం కొత్త విషయమేమీ కాదు. భారీ వర్షాలకు నగరాలు మునిగిపోవడమూ అలవాటైపోయిన వ్యవహారంగానే వుంది. కానీ, వర్షాలు పడితే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించేయడమేంటి.? అది కూడా ఒక రోజు కాదు, రెండ్రోజులు కాదు.. ఏకంగా వారం రోజులు.!
సంక్రాంతి పండక్కి సెలవులిచ్చినట్లుంది పరిస్థితి. విద్యా సంవత్సరం కొద్ది రోజుల క్రితమే ప్రారంభమయ్యింది. ఇంతలోనే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో ఏకంగా వారం రోజులు సెలవు. మొదట మూడు రోజులు సెలవు ప్రకటించి, ఆ సెలవుల్ని మరో మూడు రోజులు ప్రకటించేశారు. ఇలాగైతే చదువులు సాగేదెలా.?
సరే, చదువు కంటే ప్రాణం ముఖ్యం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, చదువుకి వర్షం అడ్డంకిగా మారడమే చాలామందికి అస్సలేమాత్రం మింగుడుపడ్డంలేదు. భారీ వర్షాలు కురుస్తున్న చోట్ల సెలవులు ప్రకటిస్తే అది ఓ లెక్క. కానీ, తెలంగాణ వ్యాప్తంగా సెలవులేంటి.? అన్నదే చాలామంది సంధిస్తోన్న ప్రశ్న. భాగ్యనగరం హైద్రాబాద్‌లో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. అయితే, మరీ భారీ వర్షమేమీ కాదు. తుంపర, ఓ మోస్తరు జల్లులు.. కొన్ని సార్లు ఇంకాస్త పెద్ద వాన. అంతే. ఈమాత్రందానికే విద్యా సంస్థల్ని బంద్ పెట్టడం ఎంతవరకు సబబు.?
హైద్రాబాద్‌లో భారీ వర్షాల కారణంగా గతంలో వరదలు సంభవించినప్పుడూ ఇలా మొత్తం విద్యా సంస్థలన్నిటికీ సెలవులు ప్రకటించిన దాఖలాల్లేవు. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏంటి.? అన్నదానిపై బోల్డన్ని అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయమై తెలంగాణ సర్కారు మీద విపక్షాల నుంచి బోల్డన్ని అనుమానాలతో కూడిన ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే విద్యార్థుల భవిష్యత్తుని గందరగోళంలోకి కేసీయార్ సర్కారు నెట్టేస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లేని విద్యా సంస్థల బంద్ తెలంగాణలో ఎందుకన్నది సర్వత్రా వినిపిస్తోన్న ప్రశ్న.