TRS : రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వృధా ప్రయాస.!
TRS : ఎన్నిక జరిగేదే పోటీ చేయడానికీ.. పోటీ చేసినవారిలో ఎవరో ఒకర్ని ఎన్నుకోవడానికి. ఏకగ్రీవంగా జరిగితే అది ఎన్నిక ఎందుకు అవుతుంది.? భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం తాలూకు గొప్పతనం. మన ప్రజాస్వామ్యం అత్యున్నతమైనదనీ, మన రాజ్యాంగం బహు గొప్పదనీ చెప్పుకుంటుంటాం. కాబట్టి, ఎన్నికల్లో పోటీ అనేది అనివార్యం. పోటీ లేకపోతే, అది అసలు ఎన్నిక అవదు, ఎంపిక మాత్రమే అవుతుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయానికొస్తే, ఏకగ్రీవంగా జరగడం మంచి పరిణామం అని పదే పదే వింటుంటాం. ఎందుకు ఏకగ్రీవంగా రాష్ట్రపతి ఎన్నిక జరగాలి.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు.
ద్రౌపది ముర్ముని బీజేపీ రంగంలోకి దించింది రాష్ట్రపతి అభ్యర్థిగా. విపాక్షాల నుంచి యశ్వంత్ సిన్హా బరిలోకి దిగారు. వాస్తవానికి, పార్టీలకతీతంగా జరగాల్సిన ఎన్నిక ఇది.‘నా ఓటు గెలిచేవాడికే వెయ్యాలి..’ అనేది సగటు ఓటరు మైండ్ సెట్. మరి, రాజకీయ పార్టీలూ అలాగే ఆలోచిస్తాయ్ కదా.? అందుకే, వైసీపీ ఎలాంటి మొహమాటం లేకుండా, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది మర్ముకి మద్దతు ప్రకటించేసింది. నిజానికి, ప్రత్యేక హోదా సహా పలు అంశాల్ని ముందు పెట్టి, వైసీపీ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని ఇరకాటంలో పెట్టొచ్చు.
కానీ, దాని వల్ల ప్రయోజనం లేదనే నిర్ణయానికి వచ్చి, ఇదిగో ఇలా బీజేపీకి మద్దతిచ్చేసింది. ఇంకోపక్క, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం భిన్నంగా వ్యవహరించింది. విపక్ష కూటమి వైపు మొగ్గు చూపించింది తెలంగాణ రాష్ట్ర సమితి. కానీ, యశ్వంత్ సిన్హా గెలిచే పరిస్థితి లేదు. కానీ, తన ఓటుని వృధా చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు అనుకుంది.? అసలు గులాబీ బాస్ వ్యూహమేంటి.? అన్నదే ఎవరికీ అర్థం కాలేదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీయార్, దీన్ని ఓ సదవశకావంగా భావించినట్టున్నారు. అంతకు మించి, కేసీయార్ వ్యూహంలో పెద్ద విశేషమేమీ లేనట్టే.