TRS : అప్పుడు ఈటల రాజేందర్.. ఇప్పుడు భూవివాదంలో ఇరుక్కున్న మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే?
TRS : ఏంటో.. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మాత్రం తీవ్రంగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు.. టీఆర్ఎస్ పార్టీపై, ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూకబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ ను ఏకంగా మంత్రి వర్గం నుంచే సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఇప్పటికీ ఈటల వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా.. మరో ఎమ్మెల్యే భూవివాదంలో చిక్కుకున్నారు. ఈటల రాజేందర్ వ్యవహారం ఇంకా సమసిపోలేదు.. ఇంతలోనే మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూవివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఎవరో కాదు.. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
TRS : డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్ రెడ్డి
హైదరాబాద్ లోని కాప్రాలో ఉన్న 152 సర్వే నెంబర్ లో 90 ఎకరాల భూమి విషయంపై కేసు నమోదు అయింది. ఈ భూమి విషయమై ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తనను డబ్బు డిమాండ్ చేశారని.. శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టుకెక్కారు. ఆయన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే.. భూవివాదం విషయంలో కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో సుభాష్ రెడ్డితో పాటు.. సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఈటల రాజేందర్ వ్యవహారం ఇంకా తేలలేదు. మంత్రి మల్లారెడ్డి కూడా ఆ మధ్య ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారిని డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ ఆడియో క్లిప్ అప్పట్లో వైరల్ అయింది. దీనిపై కూడా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆడియో క్లిప్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తాను ఎవ్వరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. ఇలా.. టీఆర్ఎస్ పార్టీలో కేవలం భూకబ్జా ఆరోపణలతోనే చాలామంది నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.