Venkaiah Naidu : మళ్ళీ ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు.! ఎవరి కోసం.?
Venkaiah Naidu : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఉప రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరుగుతాయి. సాధారణంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అధికారంలో వున్న పార్టీల కసరత్తు చాలాకాలం ముందు నుంచే జరుగుతుంటుంది. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించేముందు బీజేపీలో చాలా చర్చ జరిగే వుంటుంది. ఆ చర్చల సారాంశం ఉపరాష్ట్రపతికి కూడా వివరించే వుంటారు బీజేపీ పెద్దలు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవుల్లో వున్నవారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి వుంటుందిగానీ, ఈ రోజుల్లో అలాంటి ‘నైతికత’ గురించి ఆలోచించడం ఎంతవరకు సబబు.?
అన్నది వేరే చర్చ. బీజేపీ అభ్యర్థిగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము దేశమంతా తిరిగేస్తున్నారు, ఆయా రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారు. వాస్తవానికి, రాష్ట్రపతి ఎన్నికల బరిలో పోటీ పడుతున్నారంటే, ఏ పార్టీ తనను ప్రపోజ్ చేసినాసరే, ఆ పార్టీ రాజకీయ నీడ తమపై పడకుండా చూసుకోవాల్సి వుంటుంది ఆయా అభ్యర్థులు. కానీ, అలా జరగడంలేదు. ఇదిలా వుంటే, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా ప్రమోషన్.. అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. కానీ, అది జరగదని వాళ్ళకీ తెలుసు.
ఈ రాద్ధాంతంతో వెంకయ్యనాయుడు నొచ్చుకున్నారట. ఇప్పుడేమో, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు మళ్ళీ.. అంటూ టీడీపీ అనకూల మీడియా షరామామూలు ప్రచారానికి ఇంకోసారి తెరలేపింది. ఇంతకీ, ఈ వార్తల్లో నిజమెంత.? బీజేపీ ఏం అనుకుంటే అదే జరుగుతుంది. వెంకయ్యను రిపీట్ చేయాలనుకుంటే చేస్తుంది. లేకపోతే లేదు. కానీ, ఈ దుష్ప్రచారాల వల్ల వెంకయ్యనాయుడు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులకు డ్యామేజ్ కలుగుతోందన్నది నిర్వివాదాంశం. వీటి వల్ల టీడీపీ అనుకూల మీడియాకి కలిగే రాజకీయ లబ్ది ఏంటో ఎవరికీ అర్థం కావడంలేదు.