Rythu Bharosa : పెట్టుబడి సాయం పై ఊసెత్తని ప్రభుత్వం.. రైతన్నకు భరోసా అందేదెన్నడు ?
ప్రధానాంశాలు:
Rythu Bharosa : పెట్టుబడి సాయం పై ఊసెత్తని ప్రభుత్వం.. రైతన్నకు భరోసా అందేదెన్నడు ?
Rythu Bharosa : రాష్ట్రంలో గతంతో పోల్చితే ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అడపాదడపా కురుస్తున్న వర్షాలే తప్ప సాగుకు అవసరమైన సమయంలో వర్షాలు కురవలేదు. అయితే అదృష్టవశాత్తు మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరింది. వరద నీరు పోటెత్తడంతో జలాశయాలు నిండుకుండలా మారి పొంగి పొర్లుతున్నాయి. అయితే రాష్ట్రంలో వర్షాల లేమి ప్రభావం సాగుపై స్పష్టంగా కనిపిస్తున్నది.
గతేడాదితో పోల్చితే ఈ సీజన్‌లో సాగు ఏకంగా 8 లక్షల ఎకరాల్లో తగ్గింది. గత ఈ సమయానికి 1.09 కోట్ల ఎకరాలు సాగు కాగా, ప్రస్తుం 1.01 కోట్ల ఎకరాలే సాగు అవుతున్నది. సీజన్ ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఇంకా రైతు భరోసా అందించలేదు. రైతు బంధు సొమ్ముతో రుణమాఫీ చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతు భరోసా కింద కాంగ్రెస్ సర్కారు ఎకరానికి రూ.7,500 చొప్పున ఇవ్వాలంటే దాదాపు రూ.12 వేల కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం ఈ నిధులను ఆపేసింది.
పంటల సాగుకు పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం ఊసెత్తడం లేదు. వానకాలం సాగు దాదాపు పూర్తయింది. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు నయాపైసా పెట్టుబడి సాయం అందలేదు. గత ఏడాది బీఆర్‌ఎస్ సర్కారు జూన్ 26న రైతుబంధు పంపిణీని ప్రారంభించి ఆగస్టు 23 వరకు రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమచేసింది. దాంతో రైతులకు పెట్టుబడి సాయానికి ఇబ్బంది రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనే అంశంపై స్పష్టత కరువైంది. అసలు ఇస్తారా? లేక ఈ సీజన్‌కు మంగళం పాడుతారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.