KCR : కేసిఆర్ కి కల్వకుంట్ల కవిత వల్ల అవమానమా? గర్వమా?
KCR : అక్కడెక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది. కానీ.. దాని ప్రకంపనలు మాత్రం తెలంగాణలో వినిపిస్తున్నాయి. నిజానికి లిక్కర్ స్కామ్ జరిగింది ఢిల్లీలోనే కానీ.. ఆ స్కామ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధం ఉందంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ స్కామ్ కాస్త తెలంగాణలోనూ చర్చనీయాంశం అయింది. ఓవైపు ఢిల్లీ బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా కవితపై ఆరోపణలు చేస్తున్నారు. అదంతా ఉత్త ఆరోపణే అంటూ టీఆర్ఎస్ నేతలు కొట్టేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ నేతలు ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్దకే వెళ్లి అక్కడ ఆందోళనలు నిర్వహించారు. దీంతో వాళ్లపై హత్యాయత్నం కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. దీంతో ఆ స్కామ్ విషయం ఇంకా రచ్చ రచ్చ అయింది. బీజేపీ నాయకులపై నాంపల్లి కోర్టులో కవిత.. పరువునష్టం దావా వేశారు. అన్ని జిల్లాల కోర్టుల్లో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులపై కవిత పరువు నష్టం దావాలు వేయడానికి సిద్ధం అవుతున్నారు.
KCR : లిక్కర్ స్కామ్ వల్ల ఎవరికి మేలు జరిగింది?
లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం ఉందా లేదా అనేది పక్కన పెడితే అసలు ఈ స్కామ్ పై బీజేపీ నేతలు రచ్చ రచ్చ చేయడం వల్ల ఎవరికి రాజకీయంగా లబ్ధి చేకూరింది. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని అవినీతి కుటుంబంగా రోడ్డు మీద నిలబెట్టేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయా? అసలు సీఎం కేసీఆర్ ఫ్యామిలీతో పాటు టీఆర్ఎస్ పార్టీ మొత్తం కవితకు అండగా నిలబడింది.
బీజేపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ నేతలు కూడా బాగానే శ్రమించారు. వారి కుట్రలను బట్టబయలు చేశామని టీఆర్ఎస్ కూడా భావిస్తోంది. కానీ.. నిజంగానే అన్ని జిల్లా కోర్టుల్లో కవిత పరువు నష్టం దావా వేస్తారా? అయితే.. ఇలా దూకుడుతో పరువు నష్టం దావా వేసి ప్రజల్లో బీజేపీనే తప్పు చేస్తోంది అనే భావనను కల్పించేందుకే కవిత ఈ పని చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా లిక్కర్ స్కామ్ అనేది చివరకు టీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది. టీఆర్ఎస్ పార్టీని చివరకు బదనాం చేయగలిగాం అని బీజేపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. మరి.. ఈ స్కామ్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.