YS Jagan : ‘అలాంటి’ నిర్ణయాల విషయంలో వైఎస్ జగన్ వెనక ఉండి నడిపిస్తోంది ఎవరు?
YS Jagan : 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ వెళ్తున్నారు. ప్రజల కోసం ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు రాష్ట్రానికి ఏం అవసరమో అది ఆలోచించలేకపోయారు అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. ఎందుకంటే.. 2014 లో ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఏం బాగోలేదు. ఏపీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. చివరకు సరైన రాజధాని కూడా లేదు.
ప్రజల బాగోగులతో పాటు..రాష్ట్రానికి పెట్టుబడులను కూడా తీసుకురావాలి. కానీ.. చాలా కంపెనీలు రాలేదు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తికాలేదు. ఓవైపు నిరుద్యోగం, మరోవైపు రాజధానుల విషయం, ఇంకోవైపు ఉన్న సంస్థల పేర్లు మార్చడం.. ఇలా పలు రకాల విషయాలపై ఎందుకో వైసీపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందేమో అని ఆరోపణలు వస్తున్నాయి. అసలు.. ఎన్టీఆర్ పేరు మీద ఉన్న యూనివర్సిటీని ఎందుకు మార్చాలి. ఈ సమయంలో దానికి వైఎస్సార్ అనే పేరు పెడితే రాష్ట్రానికి ఒరిగేదేంటి. ఇంకో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో యూనివర్సిటీ పేరు మారుస్తూ బిల్లును తీసుకురావడం ఎందుకు. అది ఇప్పుడు అంత అవసరమా? అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
YS Jagan : వైసీపీ నేతలకే పేరు మార్చడం నచ్చడం లేదా?
కొందరు వైసీపీ నేతలకే యూనివర్సిటీ పేరు మార్చే విషయం నచ్చడం లేదని తెలుస్తోంది. ఇటువంటి నిర్ణయాల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని జగన్ ముందే ఎందుకు ఊహించలేదు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని జగన్ కు అసలు ఎవరు సలహాలు ఇస్తారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుందో అర్థం చేసుకోరా? ఇవి జగన్ సొంత నిర్ణయాలు కాకపోవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి నిర్ణయాల వెనుక ఎవరు ఉన్నా జగన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు కాస్తో కూస్తో ఆలోచించి ముందడుగు వేయాలని అంటున్నారు.