Ys Jagan : ఏపీకి ప్రత్యేక హోదా.. దేవుడి మీద భారం వేసిన వైఎస్ జగన్..
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాత పాటే పాడారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ఇదే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి పదే పదే గుర్తు చేస్తున్నానని తెలిపారు. అయినా అంతకుమించి మనం చేయగలిగింది ఏముంది అని ఎదురుప్రశ్నించారు. హస్తినలో ఉన్నది పేరుకే ఎన్డీఏ సర్కారు.. పెత్తనమంతా బీజేపీదే.. పార్లమెంటులో బీజేపీకి బ్రహ్మాండమైన మెజారిటీ ఉండటంతో ఆ పార్టీ చెప్పేదే మాట, చేసేదే శాసనం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అందువల్ల మనం డిమాండ్ చేసే సీన్ అక్కడ లేదు అని సీఎం వైఎస్ జగన్ మరోసారి తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.
Ys Jagan ఆనాడే చెప్పారు.. ఏపీకి ప్రత్యేక హోదా
2019లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజే వైఎస్ జగన్ నిర్మొహమాటంగా ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కమలం పార్టీకి దేశవ్యాప్తంగా ఈ రేంజ్ లో గాలి వీయటం ఏపీకి బ్యాడ్ లక్ అని అన్నారు. కాషాయం కూటమికి వైఎస్సార్సీపీ లాంటి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం అయినప్పుడు ఈ స్పెషల్ స్టేటస్ లాంటి డిమాండ్లని ముందు పెట్టి దానికి ఒప్పుకుంటేనే సపోర్ట్ చేస్తాం అని కండిషన్ పెట్టేవాళ్లం. కానీ అలాంటి సందర్భం వచ్చే అవకాశాలే లేవు. కాబట్టి ప్రత్యేక హోదా గురించి నిలదీసి అడిగే ఛాన్స్ మనకు లేకుండా పోయింది అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ఆ రోజు కోసమే వెయిటింగ్.. : Ys Jagan
ఏపీకి ప్రత్యేక హోదాను సాధించటానికి పోరాటం చేసినా బీజేపీ పట్టించుకునే స్థితిలో లేనప్పుడు మనం ఏం చేయలేం. దేవుడి దయతో ఆంధ్రప్రదేశ్ కి కూడా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ స్టేటస్ వస్తే ప్రైవేట్ రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాలు వచ్చేవని, గత పాలకులు(నారా చంద్రబాబునాయుడు) ప్రత్యేక హోదాతో రాజీపడి రాజకీయం చేశాడని, స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొని నిరుద్యోగుల గొంతు కోశాడని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.