Bjp-Ysrcp : ఎన్డీయేలోకి వైసీపీ… కండిషన్స్ అప్లై..!
Bjp-Ysrcp : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతానికి రాష్ట్రంలో రాజకీయపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఉంటే గింటే ఆర్థికపరమైన సమస్యలే ఉన్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వరుసగా రెండేళ్లు కరోనా కారణంగా ఏపీ ఆదాయం ఏమంత ఆశాజనకంగా లేదు. అందువల్ల మరిన్ని అప్పులు చేయాల్సిన అవసరం వస్తోంది. అయితే ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికితోడు వైఎస్ జగన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన సీబీఐ, ఈడీ కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఒక వైపు కొత్తగా రుణాలు దొరక్క, మరోవైపు కేసుల విచారణలు ఊపందుకుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇరకాటంలో పడతారు.
ఇప్పటివరకు ఓకే..
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా తొలి రెండేళ్లు సాఫీగానే గడిచాయి. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్నాకొద్దీ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. అంటే ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొనాలి. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. మనం ఇతరుల సాయాన్ని కోరినప్పుడు వాళ్లు మనకు కండిషన్లు పెట్టడంలో అర్థం ఉంటుంది. కానీ మనం వాళ్లకు షరతులను విధించలేం. బేషరతుగా సపోర్ట్ ఇవ్వాలి. అంటే ఎన్డీఏ కూటమిలో చేరకపోయినప్పటికీ మోడీ సర్కారులో మంత్రి పదవులు తీసుకుంటే చాలు. వచ్చే మూడేళ్లూ నల్లేరు మీద నడకలా సాఫీగా సాగిపోవచ్చు. అటు ప్రధాని మోడీకి కూడా మంచి ఫ్రెండ్ దొరికాడనే శాటిస్ ఫ్యాక్షన్ ఉంటుంది. అసలే ప్రశాంత్ కిషోర్ మూడో కూటమి కోసం ప్రయత్నాలను ముమ్మురం చేస్తున్నాడు.
హామీలేం కావాలి?.. : Bjp-Ysrcp
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు, విభజన హామీలు, మూడు రాజధానులు వంటి అంశాలపై కేంద్రం నుంచి క్లారిటీ లేకుండానే కాషాయం పార్టీ ప్రభుత్వంతో వైఎస్ జగన్ జత కలవబోతున్నాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండేళ్లు ఎలాంటి ఆటంకాలూ లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మనుగడ సాగించి చివరి (ఎన్నికల) ఏడాది కేంద్రంతో గట్టిగా హామీలు ఇప్పిస్తే సరిపోతుంది. ఈ లోగా సీబీఐ, ఈడీ కేసులు కూడా కొలిక్కి వస్తాయి. ముందు పర్సనల్ గా ఫ్రీ అయితే ఆ తర్వాత పొలిటికల్ గా ఏ స్టెప్ వేసినా పెద్దగా నష్టం ఉండదు. సంక్షేమ పథకాలను ఇప్పటి మాదిరిగానే కంటిన్యూ చేస్తే ఓటర్లు రెండోసారి తప్పకుండా ఛాన్స్ ఇస్తారు.
ఎలా ఉంటుందో చెప్పలేం..
కేంద్రంలో బీజేపీకి ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ తో కమలం పార్టీ, ప్రధాని మోడీ ఇమేజ్ రెండూ డ్యామేజ్ అయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మూడోసారి కాషాయం పార్టీకి ఓటర్లు ఛాన్స్ ఇస్తారో లేదో చెప్పలేం. దీనికితోడు ప్రధాని మోడీ మరోసారి కేబినెట్ ని విస్తరించే సూచనలు లేవు. కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ గెలిస్తే మంత్రివర్గంలో చేరేందుకు అనుకూల పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్ కి, కాంగ్రెస్ కి అస్సలు పడదు కాబట్టి. అందుకే ఇప్పుడే కండిషన్లు ఏమీ పెట్టకుండానే వైఎస్ జగన్ కమలం కూటమి ప్రభుత్వంలో చేరనున్నట్లు సమాచారం.