YS Jagan : థానోస్ రెడ్డి వర్సెస్ దత్త పుత్రుడు.! అవసరమా ఇదంతా.?
YS Jagan : అసలు పేర్లు మానేసి, కొత్త పేర్లతో రాజకీయాల్లో విమర్శలు ఎక్కువైపోయాయ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయనడానికి ఇదే నిదర్శనం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద రకరకాల పేర్లతో, ప్రస్తావించడానికి వీల్లేనంత జుగుప్సాకరమైన రీతిలో విపక్షాలు విమర్శించడం చూస్తున్నాం. భరించారు.. భరించారు, కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. జనసేన అధినేత పవన్ కళ్యాన్ తమకు ఏ రకంగానూ పోటీ కాదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే, పవన్ కళ్యాణ్ పేరుని ప్రస్తావించడానికి కూడా వైఎస్ జగన్ ఇష్టపడటంలేదు. ఈ క్రమంలోనే దత్త పుత్రుడు..
అన్న ప్రస్తావన వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారు. టీడీపీ – జనసేన మధ్య నడుస్తున్న అనైతిక బంధాన్ని ఎక్స్‌పోజ్ చేసే క్రమంలోనే వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీతో మేం కలిసి పోటీ చేయబోతున్నామని జనసేన చెప్పినా మంచిదే. లేదూ, ఒంటరిగా తమ పని తాము చూసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పినా మంచిదే. కానీ, తెరవెనుక అనైతిక సంబంధాన్ని టీడీపీ, జనసేన కొనసాగించడం ద్వారా వైసీపీ సర్కారుపై బురద చల్లడాన్ని వైఎస్ జగన్ సహించలేకున్నారు. నిజానికి, ఇక్కడ వైఎస్ జగన్, ‘సీబీఎన్ దత్త పుత్రుడు..’ అని పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం తప్పు కాకపోవచ్చు.
అయితే, ముఖ్యమంత్రిగా తన స్థాయికి ఆ మాటలు తగవని వైఎస్ జగన్ తెలుసుకుంటే మంచిదేమో.. అన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఇప్పుడేమయ్యింది.? జనసేన పార్టీ కొత్త పేర్లను ముఖ్యమంత్రికి ఆపాదిస్తోంది. మొన్నటిదాకా సీబీఐ దత్త పుత్రుడన్నారు. ఇప్పుడేమో థానోస్ రెడ్డి అంటున్నారు జనసేన నేతలు. ఇవి జనసేన స్థాయికి తగని మాటలు. రాజకీయాల్లో మార్పు అంటే ఇలాగేనా.? కుసంస్కారంతో కూడిన విమర్శలు ఎలా చేయగలుగుతారు.? వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విసయం జనసేన మర్చిపోవడం శోచనీయం. రాజకీయాల్లో విలువలకు వలువలూడ్చేలా చేయడమే జనసేన కోరుకుంటున్న మార్పుగా భావించాలా.?