Ys Jagan : వైఎస్ జగన్ సరిదిద్దుకోవాల్సినవి చాలానే వున్నాయ్.!
Ys Jagan ; ఎంత మంచి చేశామన్నది కాదు, ఆ మంచి ‘కనబడేలా’ చేయడం కూడా ముఖ్యం. ఇంగ్లీషు మీడియం విషయానికొస్తే, అది మంచి పనే. నిజానికి, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు. ఎందుకంటే, భవిష్యత్తు అంతా ఇంగ్లీషు చుట్టూనే నడవనుంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇంగ్లీషుని ప్రోత్సహించారు. కానీ, ఇప్పుడు రాజకీయంగా వైఎస్ జగన్ సర్కారుపై ‘ఇంగ్లీషు మీడియం’ విషయమై విమర్శలు చేస్తున్నారు. ఏది మంచి.? ఏది చెడు.? అన్న విషయమై జనానికి అర్థమయ్యేలా చెప్పడంలో వైసీపీ ఎక్కడో విఫలమవుతోందన్నది నిర్వివాదాంశం.
పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, విపక్షాల మీద విమర్శలతోనే సరిపెడుతున్నారు తప్ప తమ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాల్ని జనానికి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారన్నది నిర్వివాదాంశం. ఇంగ్లీషు మీడియం విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ ఇదే పరిస్థితి. 2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు మొత్తంగా 175 సీట్లూ గెలవడమంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. అసలు 151 సీట్లను గెలవడమే ఓ అద్భుతం. అది సాధ్యమయినప్పుడు, 175 ఎందుకు సాధ్యం కాదు.? అన్న ఆలోచన ముఖ్యమంత్రిలో కలగడమంటే చాలా గొప్ప విషయమని, వైసీపీ ముఖ్య నేతలు, మంత్రులు కూడా గుర్తెరగాలి, తమ బాద్యతల్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలి.
పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని తొలుత ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత అది లీక్ అయినట్టు కాదని మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఇంతలోనే పేపర్ లీక్ అయినట్లు కేసులు నమోదయ్యాయి, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశారు. ‘అధికారులు చెబితే అదే కరెక్ట్..’ అని మంత్రి బొత్స తన గొంతు సవరించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి విషయాల్లో గందరగోళం అస్సలు పనికిరాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత స్పష్టతో వుంటున్నారో, ప్రభుత్వంలో వున్న వైసీపీ కీలక నేతలూ అంతే స్పష్టతో వుంటేనే, వైఎస్ జగన్ కష్టానికి తగిన ఫలం లభిస్తుంది. మంచి చేసేస్తున్నామని చెప్పేసి ఊరుకుంటే కుదరదు. తాము మంచి చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించేలా వైసీపీ చేసుకోవాల్సి వుంటుంది.