YSR : వైఎస్సార్‌ని కుట్ర చేసి చంపారు: మొదటి నుంచీ వైఎస్ కుటుంబానికి అదే అనుమానం.
YSR : వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే, అధికారిక పర్యటన నిమిత్తం హెలికాప్టర్‌లో వెళుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. విధి నిర్వహణలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే, అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదన్న విమర్శలున్నాయి. హెలికాప్టర్ గల్లంతయ్యిందన్న విషయం బయటకు పొక్కాక, కేంద్రం తక్షణం రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సి వున్నా, ఆ చర్యల విషయంలో ఆలస్యం జరిగిందన్న ఆరోపణలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఆ తర్వాత మొక్కుబడి విచారణ ఆ ఘటనపై చేసేసి ‘మమ’ అనిపించేసుకుంది అప్పటి కేంద్ర ప్రభుత్వం.
కొత్త హెలికాప్టర్ అందుబాటులో వున్నా, పాత హెలికాప్టర్‌ని వైఎస్ ఎందుకు వినియోగించారు.? వాతావరణం అనుకూలించదని తెలిసినా, ఎలా హెలికాప్టర్ ప్రయాణానికి అప్పట్లో అనుమతులు మంజూరు అయ్యాయి.? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. తాజాగా, వైఎస్సార్ మరణంపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల తాజాగా మాట్లాడుతూ, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు. నన్ను కూడా అలాగే చంపుతారేమో..’ అంటూ వ్యాఖ్యానించడం పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. ఇవేవో యధాలాపంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కావట.
ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో లేటెస్ట్‌గా మాట్లాడిన షర్మిల, ఆ ఘటన జరిగిన రోజు నుంచే మాలో అనుమానాలున్నాయి. ఈ విషయంలో మా కుటుంబమంతటికీ ఒకే అనుమానం వుంది. ఓ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే, ఎందుకు సరైన రీతిలో విచారణ జరగలేదు.? అన్న అనుమానం వున్నా, అప్పటి కేంద్ర ప్రభుత్వమే ఆ కేసుని నిర్లక్ష్యం చేశాక, ఎవర్ని ఈ విషయంలో నిలదీసి, న్యాయం పొందగలం.? అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.