YSRCP : నక్క తోక తొక్కి వచ్చాడా.. వైసీపీలో ఆ సీనియర్ నేతకు పట్టిందల్లా బంగారమే?
YSRCP : రాజకీయాల్లో రాణించాలంటే మాటకారి అయి ఉంటే సరిపోదు. కాసింత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే రాజకీయాల్లో రాణించగలుగుతారు. ఏ పార్టీ అయినా సరే.. అదృష్టం లేకపోతే పదవులు దక్కవు. ఎన్నికల్లో గెలవరు. జనాల్లో ఎంత ఫేమ్ ఉన్నా.. కాస్తో కూస్తో అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే పదవులు దక్కుతాయి. ప్రజల ఆశీర్వాదం లభిస్తుంది. ఇప్పుడు వైసీపీలో అలా నక్క తోక తొక్కి వచ్చిన ఒక నేత ఉన్నాడు. ఆయన పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఆయనకు వైసీపీలో పదవులే పదవులు. ఆయన ఎవరో కాదు.. షేక్ మహమ్మద్ ఇక్బాల్. ఆయనకు ప్రస్తుతం వైసీపీలో వరుసగా పదవులు ఊరిస్తున్నాయట.
సీఎం జగన్ కూడా ఇక్బాల్ కు పదవులు ఇచ్చేందుకు సై అంటున్నారట. ప్రస్తుతం ఇక్బాల్ ఎమ్మెల్సీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీగా ఉన్న మహమ్మద్ ఇక్బాల్ కు తాజాగా మరో పదవి వరించబోతోంది. అదే శాసనమండలి చైర్మన్ పదవి. ఆ పదవిని ఇక్బాల్ కే ఇవ్వాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పదవీ కాలం పూర్తి అవుతోంది. దీంతో అదే వర్గానికి చెందిన మహమ్మద్ ఇక్బాల్ కు ఆ పదవిని ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
YSRCP : 2019 లో బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయినా పదవులు పొందిన ఇక్బాల్
నిజానికి మహమ్మద్ ఇక్బాల్ ది కర్నూలు జిల్లా. అయినప్పటికీ.. ఆయన్ను సీఎం జగన్.. హిందూపురం నియోజకవర్గం అభ్యర్థిగా ఎంపిక చేశారు. 2019 ఎన్నికల్లో ఆయన హిందూపురం నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేశారు. కానీ.. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమి చెందారు. అయినప్పటికీ.. మైనార్టీ కోటాలో ఇక్బాల్ కు మరోసారి ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. అలాగే.. ఇక్బాల్.. సీఎం జగన్ కు నమ్మకమైన నేతగా ఉంటున్నారు. మరోసారి వచ్చే ఎన్నికల్లో.. హిందూపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడం కోసం.. ఇక్బాల్ కు మంచి పదవి ఇవ్వాలని సీఎం జగన్ యోచిస్తున్నారట.
అక్కడ బాలకృష్ణను ఓడిస్తే.. టీడీపీ పరువు బజారున పడుతుందని.. అందుకే.. మహమ్మద్ ఇక్బాల్ కు ముందు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావించారు కానీ.. మంత్రి పదవి కన్నా.. మండలి చైర్మన్ పదవి బెటర్ అనుకొని.. ఆ పదవిని ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు శాసనమండలి చైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు.. హిందూపురంలో పార్టీని బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వరుసగా.. ఇక్బాల్ కు పదవులు వరిస్తుండటంతో.. వైసీపీలో ఇక్బాల్ ఒక్కరే నక్క తోక తొక్కి వచ్చారంటూ వార్తలు వస్తున్నాయి.