జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ ప్యానెల్ సంచలన‌ నివేదిక : మోడీ సామాన్యుడు కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ ప్యానెల్ సంచలన‌ నివేదిక : మోడీ సామాన్యుడు కాదు

 Authored By brahma | The Telugu News | Updated on :19 March 2021,8:00 am

Modi : జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కార్‌ వదిలిపెట్టటం లేదు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ, మోదీ ప్రభుత్వం చాలారోజులుగా ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ ప్రతిపాదనకు పార్లమెంటరీ స్థాయీసంఘం మద్దతు కూడా లభించింది. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని, రాజకీయ పార్టీల వ్యయం కూడా దిగివస్తుందని , కాబట్టి, వాటిని నిర్వహించటం మంచిదేనని పేర్కొంటూ నివేదికను సమర్పించింది.

jamili elections

కేంద్ర సిబ్బంది, న్యాయశాఖలకు సంబంధించి ఏర్పాటైన స్థాయీసంఘం ఈ నివేదికను రూపొందించింది. దీనిని మంగళవారం పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జమిలి ఎన్నికల వల్ల మానవ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని నివేదికలో స్థాయీసంఘం పేర్కొన్నది. తరచూ జరిగే ఎన్నికలతో ప్రజల్లో ఏర్పడిన అనాసక్తిని జమిలి ఎన్నికలతో తగ్గించవచ్చని, తద్వారా ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని అభిప్రాయపడింది.

Modi : కొత్తేమీ కాదు..

దేశంలో జమిలి ఎన్నికలు కొత్తకాదని, తొలి మూడు సార్వత్రిక ఎన్నికలు (1952, 57, 62) జమిలి పద్ధతిలోనే జరిగాయని నివేదిక గుర్తుచేసింది. రాజ్యాంగానికి సవరణలు చేయడం ద్వారా మళ్లీ జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా లోక్‌సభ, ఆయా రాష్ట్రాల శాసనసభల గడువులను ఒకదానికొకటి సర్దుబాటు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నది.

ఇందుకు పలు రాష్ట్రాల చట్టసభల గడువును పొడిగించడం లేదా తగ్గించడం చేయాల్సి ఉంటుందని, దీనికి రాజకీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరమున్నదని తెలిపింది. నిత్యం ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై భారం పడుతున్నదని, అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నదని పేర్కొన్నది. 1983లో ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది.

అనంతరం జస్టిస్‌ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్‌ కూడా ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపిందని గుర్తుచేసింది. వివిధ అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలు కూడా తమ నివేదికలను సమర్పించాయి. వాటిని ప్రభుత్వం పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టింది.భారత ప్రభుత్వ యంత్రాంగం ఒక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌పైనే అధికంగా ఆధారపడుతున్నదని ఒక పార్లమెంటరీ స్థాయీసంఘం తన నివేదికలో పేర్కొన్నది. దీనిని బట్టి చూస్తుంటే దేశం మొత్తం మీద జమిలి ఎన్నికలు జరగటం ఖాయమని తెలుస్తుంది.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది