Revanth Reddy : ఫలిస్తున్న కాంగ్రెస్ స్కెచ్.. డిసెంబర్ ఫలితం ఇదేనా?
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రారంభమైంది. ఇంకో నెలన్నరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల కోసం వ్యూహాలు రచించాయి. ఇక.. జనాల్లోకి వెళ్లి ప్రచారం చేయడమే మిగిలి ఉంది. ఎలా ప్రజలను ఆకట్టుకోవాలి. ఎలాంటి హామీలు ఇవ్వాలి. మ్యానిఫెస్టోలో ఏం పెట్టాలి.. అభ్యర్థుల ఎంపిక.. ఇవన్నీ తుది అంకానికి చేరుకున్నాయి. ఇక.. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం మొదలు పెట్టడమే. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వ్యూహాలు రచిస్తున్నదో.. దానికి మించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ కు తెలంగాణలో అనుకూల పవనాలు వీస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కూడా ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. అందుకే కాంగ్రెస్ లోకి వలసలు కూడా పెరిగాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి భారీగా వలసలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తోంది అనే చెప్పుకోవాలి.
ఇప్పటికే 6 గ్యారెంటీ స్కీమ్ లతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్లాన్ రెడీ చేస్తోంది. ప్రజల్లోకి ఆరు గ్యారెంటీ స్కీమ్ లను విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. మహిళల కోసం మహాలక్ష్మీ, గృహ జ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాస చేయుత వంటి వాటితో ఆయా వర్గాల ఓట్లు రాబట్టుకోవచ్చని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలకు మించేలా కాంగ్రెస్ పథకాలను రెడీ చేస్తోంది. తెలంగాణ కల సాకారం చేసిన సోనియాతో ఆరు గ్యారెంటీలకు ప్రకటించేలా చేశారు. ప్రజల్లో నమ్మకం కలిగేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వివిధ డిక్లరేషన్లతో అన్ని వర్గాల భవిష్యత్తుకు హామీ ఇస్తోంది. వరంగల్ జిల్లాలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. యూత్ డిక్లరేషన్ తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. వీటికి తోడు కొత్త నేతల చేరికలు పార్టీకి ఊపు తీసుకొచ్చాయి. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన మాత్రం పార్టీలో ఉంది.
Revanth Reddy : అభయ హస్తం పేరుతో పార్టీ స్కీమ్ ల ప్రకటన
అభయ హస్తం పేరుతో పార్టీ స్కీమ్ లను ప్రకటిస్తోంది. అలాగే.. ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక ఇన్ చార్జీని నియమించబోతున్నారు కాంగ్రెస్ నేతలు. అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యమైనా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. తిరగబడదాం.. తరిమికొడదాం.. ఇదే ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికల స్లోగన్. డిసెంబర్ లో అద్భుతాలు జరగబోతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయిందని రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించబోతోందని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందన్న రేవంత రెడ్డి.. సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గెలుపుపై పూర్తి నమ్మకంతో కనిపిస్తోంది.