AP Deputy Speaker : డిప్యూటీ స్పీకర్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. బీజేపీ, జనసేనలో పదవి ఎవరికి..!
AP Deputy Speaker : ఏపీలో ప్రస్తుతం పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసింది. కొత్త శాసనసభ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. కూటమిలో మరో కీలక భాగస్వామి అయిన జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. ఉప సభాపతి ఎవరనేది తేల్చకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో రానున్న శాసన సభ సమావేశాల్లోనే దీనిపై క్లారిటీ రానుంది.
AP Deputy Speaker ఇంకా సస్పెన్స్ ఎందుకు..
అయితే, ఎందుకు డిప్యూటీ స్పీకర్ పదవిని హోల్డ్ లో పెట్టారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కని సామాజిక వర్గాలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విజయనగరం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు స్పీకర్ పదవి ఉత్తరాంధ్రకు ఇవ్వటంతో..అదే ప్రాంతానికి చెందిన వారికి డిప్యూటీ ఇస్తారా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో మిత్రపక్షం అయిన బిజేపీలో ఎవరికైన ఛాన్స్ ఇస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బీజేపీ నుంచి సుజనా చౌదరి, నల్లిమిల్లి రామక్రిష్ణారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే విధంగా టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. రఘురామ రాజు కు డిప్యూటీగా అవకాశం ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. క్షత్రియ వర్గానికి మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. దీంతో, రఘరామ రాజుకు డిప్యూటీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా నడుస్తుంది. మరోవైపు రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసుల పేరు కూడా పరిశీలనలో ఉంది.కూటమి పార్టీలో ఎవరికి ఈ పదవి అప్పగించాలన్న దానిపై కసరత్తు కొలిక్కి రాకపోవడంతోనే డిప్యూటీ స్పీకర్ పదవిని హోల్డ్ లో పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవటం తో ఆ పదవి మిత్ర పక్షంలోనే ఎవరికైన ఇస్తారనే టాక్ నడుస్తుంది. దీనిపై పవన్- చంద్రబాబు చర్చిస్తున్నట్టు సమాచారం.