Telangana CM Revanth Reddy : జెడ్పీటీసీ టు తెలంగాణ ముఖ్యమంత్రి.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ట్విస్టులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana CM Revanth Reddy : జెడ్పీటీసీ టు తెలంగాణ ముఖ్యమంత్రి.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ట్విస్టులు

 Authored By kranthi | The Telugu News | Updated on :5 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రేవంత్ రెడ్డి

  •  జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్న రేవంత్

  •  చదువు దశలోనే రాజకీయాలపై ఆసక్తి

Telangana CM Revanth Reddy : తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటే టక్కున మనం కేసీఆర్ పేరు చెబుతాం. మరి రెండో ముఖ్యమంత్రి అంటే ఎవరి పేరు చెబుతాం. రెండో సారి కూడా కేసీఆర్ అయ్యారు కాబట్టి కేసీఆర్ పేరే అంటాం. కానీ.. కేసీఆర్ కాకుండా తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రెండో నాయకుడు ఎవరు అంటే ఇప్పుడు మనం చెప్పే పేరు రేవంత్ రెడ్డి. అవును.. ఇది పేరు మాత్రమే కాదు. ఆయన ఒక శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికయినప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయి వరకు చేరుకోవడం అనేది ఏదో రెడ్ కార్పెట్ పరిచినట్టుగా కాలేదు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు…

టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అంటే పెద్దగా జనాలకు తెలియలేదు. ఆయన కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. కానీ.. ఎప్పుడైతే కాంగ్రెస్ లో చేరి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికయ్యారో అప్పటి నుంచి రేవంత్ పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగిపోయింది. అప్పుడే ఆయనకు ఫాలోయింగ్ ప్రారంభమైంది. తెలంగాణ నా వల్లనే వచ్చింది అని చెప్పుకొని రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ను గద్దె దించే స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారు. అందుకే రాజకీయాల్లో రేవంత్ ను ఫైర్ బ్రాండ్ అంటారు. నిజానికి రేవంత్ రెడ్డి చాలా సాధారణ వ్యక్తి. ఆయనది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి అనే కూగ్రామం. కాకపోతే చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే రేవంత్ కు చాలా ఇష్టం. అందుకే విద్యార్థిగా చదువుకుంటున్న సమయం నుంచే రాజకీయాల్లో తిరిగేవారు. ఆయన భార్య ఎవరో కాదు.. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రాకముందు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు.

Telangana CM Revanth Reddy : టీఆర్ఎస్ తోనే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభం

నిజానికి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీతోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు అని చెప్పుకోవాలి. 2006 లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి. పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి అప్పట్లో జెడ్పీటీసీ టికెట్ ఆశించిన రేవంత్ రెడ్డి తనకు ఆ టికెట్ దక్కకపోవడంతో వెంటనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి జెడ్పీటీసీగా గెలుపొందారు. అంతే కాదు.. 2007 లో స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

2009 ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి టీడీపీ నుంచి టికెట్ కేటాయించింది పార్టీ. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు రేవంత్ రెడ్డి. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2014 లోనూ అదే కొడంగల్ నుంచి విజయం సాధించారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొన్నాళ్లు పని చేశారు రేవంత్. కానీ.. 2015 లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కొడంగల్ లో ఓడిపోయారు కానీ.. 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో ఆయన్ను టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడంతో పాటు.. 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా చేసి సక్సెస్ అయ్యారు. చివరకు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. తను రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అవడం అనేది నిజానికి వండర్ అనే చెప్పుకోవాలి. ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం అని చెప్పుకోవాలి.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది