TRS : ఈటల రాజేందర్ లాగే ‘మ‌రో ఎమ్మెల్యేకి’కి కూడా టీఆర్ఎస్ పార్టీ స్పాట్ పెడుతోందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : ఈటల రాజేందర్ లాగే ‘మ‌రో ఎమ్మెల్యేకి’కి కూడా టీఆర్ఎస్ పార్టీ స్పాట్ పెడుతోందా..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :27 June 2021,9:40 pm

TRS : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలోని ఉద్యమ నాయకులను ఒకరి తర్వాత ఒకరిని బయటకి పంపించే కార్యక్రమం జరుగుతున్నట్లు తాజా పరిణామాలని బట్టి తెలుస్తోంది. పొమ్మనలేక పొగ పెట్టే ప్రణాళికలని అమలుచేస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ ని వెళ్లగొట్టిన అధికార పార్టీ అధిష్టానం ఇప్పుడు వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సైతం సాగనంపేందుకు స్కెచ్ గీసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేటెస్టుగా వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి అవమానం జరిగింది. దీంతో పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ లో పాల్గొనకుండానే వెనుదిరిగారు.

ఎర్రబెల్లి ద్వారా..

పెద్ది సుదర్శన్ రెడ్డికి గుడ్ బై చెప్పేందుకు టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని రంగంలోకి దింపిందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ఉద్యమం సాగుతున్న రోజుల్లో ఎర్రబెల్లి దయాకర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో మొదటి నుంచీ ఉన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి నుంచే వీళ్లిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అందుకే ఇప్పుడు గులాబీ పార్టీ ఎర్రబెల్లి భుజాల మీద తుపాకీ పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్లు భావించొచ్చు.

TRS

TRS

వాళ్లిద్దరి కోసమేనా?.. : TRS

ఎర్రబెల్లి దయాకర్ రావుకి తెలుగుదేశం పార్టీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మంచి ఫ్రెండ్. రేవూరితోపాటు మరో మాజీ శాసన సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ లీడర్ దొంతి మాధవ రెడ్డిని కూడా టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఎర్రబెల్లి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. రేవూరి, దొంతిని కారు పార్టీలోకి తీసుకొచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డికి చెక్ పెట్టాలని ఎర్రబెల్లి పన్నాగాలు పన్నుతున్నారని విమర్శకులు చెబుతున్నారు.

ఇద్దరూ ఒకే చోట ఉన్నా..

errabelli dayakar rao questions bandi sanjay

errabelli dayakar rao questions bandi sanjay

టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి కొన్నాళ్లకు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అప్పటికే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డికి, ఎర్రబెల్లికి మధ్య స్నేహం మాత్రం కుదరలేదు. మొన్న సీఎం కేసీఆర్ పర్యటనలో పోలీసులు పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని అడ్డుకోగా దీనికి ఎర్రబెల్లే కారణమని భావించిన పెద్ది సుదర్శన్ రెడ్డి నేరుగా ఎర్రబెల్లి ఇంటి వద్దకు పాదయాత్రగా వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విషయాన్ని ఎవరో కేసీఆర్ కుటుంబ సభ్యులకు తెలియజేయగా వాళ్లు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వివరాలన్నింటినీ మంత్రి కేటీఆర్ ని కలిసి వివరిద్దామనుకున్నా పెద్ది సుదర్శన్ రెడ్డికి కేటీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు. మంత్రి కేటీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేకే సమయం ఇవ్వలేదంటేనే మనం అర్థంచేసుకోవాలి.. పెద్దిని కూడా ఈటల రూట్లోనే ఇంటికి పంపిద్దామని గులాబీ పార్టీ గుట్టు చప్పుడు కాకుండా పావులు కదుపుతోందని.

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది