Eetala political career: ఈట‌ల రాజేంద‌ర్ కూడా ఆ జాబితాలో చేరనున్నారా..?

0
Advertisement

Eetala political career: ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల గురించే హాట్‌హాట్‌గా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ఈట‌ల సంచ‌ల‌నం రేపుతారా..? లేదంటే ఓడిపోయి గ‌తంలో టీఆర్ఎస్‌ను వీడి క‌నుమ‌రుగైన వారి జాబితాలో క‌లుస్తారా..? అనే దానిపై డిస్క‌ష‌న్స్ కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఉప ఎన్నిక‌లే ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తును నిర్ణ‌యిస్తాయ‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది.

ఎందుకంటే, గతంలో ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయంగా దాదాపు క‌నుమ‌రుగై పోయారు. ఈ క్ర‌మంలో ఈటల రాజేంద‌ర్ ప‌రిస్థితి కూడా అలాగే మార‌నున్న‌దా..? లేదంటే ఈట‌ల‌నే టీఆర్ఎస్ ఝ‌ల‌క్ ఇస్తాడా..? అనేది ఇప్పుడు రాజ‌కీయ చ‌ర్చ‌కు ఆస‌క్తి క‌ర‌మైన అంశంగా మారింది. అయితే, ఈ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించ‌డం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న ద‌గ్గరున్న అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తున్నారు. అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి ఆయనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి.

Eetala political career: ఈట‌ల మ‌దిలోనూ అనుమానాలున్నాయా..?

ఇప్ప‌టికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌కు కూడా ఈ ఎన్నిక‌ల్లో గెలుపుపై అనుమానాలు ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఎందుకంటే హుజూరాబాద్‌లో గెలుపే ల‌క్ష్యంగా అధికార పార్టీ ఎంత ఖ‌ర్చ‌యినా పెట్టేందుకు సిద్ధ‌మైంది. కానీ, ఈట‌ల వారితో పోటీప‌డి ఖ‌ర్చు చేయ‌గ‌ల‌రా..? అనేది పెద్ద సందేహ‌మే. పైగా అధికార యంత్రాంగం నుంచి కూడా రూలింగ్ పార్టీకి మంచి స‌హ‌కారం అందనుంది. అంతేగాక నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రధాన ఓటు బ్యాంకునంతా అధికార పార్టీ తన‌ వైపునకు తిప్పుకున్న‌ట్లే క‌నిపిస్తున్న‌ది.

Eetala political career: నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీకి అంత‌గా ప‌ట్టులేదు..!

అధికార పార్టీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటికే రూ.150 కోట్లు పంచిపెట్టింద‌ని ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపిస్తున్నారు. ఈట‌ల ఆరోప‌ణ‌లు గ‌నుక నిజ‌మైతే టీఆర్ ఇప్ప‌టికే ఓట‌ర్లంద‌రినీ కొనుగోలు చేసింద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. ఈ ప‌రిస్థితుల్లో ఈట‌ల‌కు వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉన్నా బీజేపీకి నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌గా ప‌ట్టులేక‌పోవ‌డం ప్ర‌తికూలంగా మారింది. టీఆర్ఎస్‌ను ఎద‌రించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే బాగుంటుంద‌ని ఈట‌ల భావించి ఉండ‌వ‌చ్చు. కానీ ఉప ఎన్నిక‌ల్లో గెలుపున‌కు ఆ నిర్ణ‌యం ఏ మేర‌కు ఉప‌యోగ‌పడుతుందో వేచి చూడాలి.

bjp
bjp

Eetala political career: ఓడితే రాజ‌కీయ భ‌విష్య‌త్తు క‌నుమ‌రుగేనా..?

ఈటల రాజేందర్ ఇప్ప‌టికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో హుజూరాబాద్ ప్రజల్లో చాలామంది ఇప్పుడు ఆయ‌న‌పై విముఖ‌తతో ఉన్నార‌నే ప్రచారం కూడా జ‌రుగుతున్న‌ది. అదేగ‌నుక నిజ‌మైతే ఈట‌ల రాజ‌కీయంగా క‌నుమ‌రుగ‌య్యే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమం కాలం నుంచి టీఆర్ఎస్‌లో ఉన్న నేత‌లు కొంద‌రు కేసీఆర్‌తో విభేదించో, కేసీఆర్ బ‌హిష్క‌రించ‌డం వ‌ల్ల‌నో బ‌య‌టికి వ‌చ్చారు. కానీ ఆ త‌ర్వాత స‌రైన రాజ‌కీయ వేదిక దొర‌క‌క క‌నుమ‌రుగై పోయారు. మరి ఈట‌ల విష‌యంలో ఏం జరుగుతుందో చూద్దాం.

Advertisement