YS Sharmila : జగనన్న సిద్ధంగా లేడు.. ఓడిపోతే ఏం చేయాలో సందిగ్ధంలో ఉన్నాడు.. వైయస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
ప్రధానాంశాలు:
YS Sharmila : జగనన్న సిద్ధంగా లేడు.. ఓడిపోతే ఏం చేయాలో సందిగ్ధంలో ఉన్నాడు.. వైయస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక వైఎస్ జగన్ ఒంటరి పోరు చేస్తుంటే మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు. ఇప్పటివరకైతే ఆమె ఎక్కడి నుంచో పోటీ చేస్తారు అనే దానిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా విజయవాడలో ఆంధ్ర రత్న భవన్లో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ సిద్ధం సభల పేరుతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటుందని ఆమె విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు చేస్తుందని, మొత్తం ఈ సభల కోసం 600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని ఆమె ప్రశ్నించారు.
గత ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ ఇచ్చిన మాట మరిచారని 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామన్నారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ చేశారు. రెండు నెలలు ఎన్నికలు ఉండగా నోటిఫికేషన్ ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు . కావలసిన వాళ్లకే వాలంటీర్ల పేరిట ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలపై మేము నిలదీస్తే తీవ్రవాదుల్లా చూశారు. హౌస్ అరెస్టులు చేశారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేదా అని ఆమె ప్రశ్నించారు. ఇక కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం 20 కోట్ల ఉద్యోగాలు రావాలి కానీ ఇవ్వలేదు అంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇక టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చేరటంపై వైయస్ షర్మిల స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. గతంలో బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న విషయాన్నీ గుర్తు చేశారు. అమిత్ షా, చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ దొంగలేనని ఆమె ఆరోపించారు.
అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. గతంలోనూ ఐదేళ్లు పొత్తు పెట్టుకున్నారని ఏపీకి బీజేపీ ఏమిచ్చిందని వైయస్ షర్మిల ప్రశ్నించారు. అప్పుడేం సాధించారనేది కూడా ప్రజలకు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇక తాను ఎక్కడినుంచి పోటీ చేయాలో దాని గురించి చర్చిస్తున్నామని దానిపై పలు అంశాలను పరిశీలిస్తున్నామని ఆమె తెలిపారు. త్వరలోనే ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెబుతామని అన్నారు. ఇక వైయస్ షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే పరిస్థితి కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కనుమరుగైన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏంటో చూడాల్సి ఉంటుందని అంటున్నారు.