IPL 2022 : రిషబ్ పంత్ రచ్చ.. బ్యాట్స్‌మెన్స్‌ని బయటకు రమ్మనడం ఏంటి?
IPL 2022 : గత రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచింది. బట్లర్ మరోసారి విజృంభించడంతో ఆర్ఆర్ టీం 222 పరుగులు చేసింది. 223 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఢిల్లీ గెలవాలంటే చివరి ఓవర్లో 36 పరుగులు చేయాలి. అంటే ఈ లెక్కన ప్రతి బాల్ ను సిక్సర్ కొట్టాల్సిన పరిస్థితి. క్రీజులో రావ్ మాన్ పావెల్ (29 బంతుల్లో 36; 5 సిక్సర్లు) ఉన్నాడు. ఆఖరి ఓవర్ ను మెకాయ్ బౌలింగ్ చేయడానికి రాగా.. స్ట్రయికింగ్ ఎండ్ లో పావెల్ సిద్ధంగా ఉన్నాడు.
పావెల్ ఆ ఓవర్ ను అద్భుతంగా ఆరంభించాడు. తొలి మూడు బంతులను సిక్సర్లుగా బాాదాడు. దాంతో విజయ సమీకరణం 3 బంతులకు 18 పరుగులుగా మారింది. అయితే ఆ ఓవర్ మూడో బంతిని మెకాయ్ హై ఫుల్ టాస్ వేశాడు. దాదాపు అది నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. దాంతో దాన్ని నో బాల్ గా ప్రకటించాలని గ్రౌండ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్, పావెల్ మొదట కోరారు. అదే సమయంలో డగౌట్ లో ఉన్న ఢిల్లీ సారథి రిషభ్ పంత్ కూడా అది నో బాల్ అంటూ సైగ చేశాడు. కానీ.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్..
IPL 2022 : పంత్ రచ్చ రచ్చ..
బంతిని లీగల్ డెలివరీగానే ప్రకటించాడు.దాంతో.. సహనం కోల్పోయిన రిషబ్ పంత్.. మైదానంలోని పొవెల్, కుల్దీప్ యాదవ్‌ని డగౌట్‌కి వచ్చేయమని సైగలు చేశాడు. దాంతో.. ఇద్దరూ ఓ రెండు అడుగులు ముందుకు వేశారు. వెంటనే అంపైర్ నితిన్ మీనన్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ.. వాళ్లు మాత్రం వినలేదు. నో బాల్‌ని థర్డ్ అంపైర్ ద్వారా రివ్యూ చేయాలని పంత్ పట్టుబడ్డాడు. అయితే నిబంధనల ప్రకారం ఔట్ అయిన బంతులకే రీప్లే చూస్తారు. దీంతో నో బాల్ రివ్యూ కుదరదని తేల్చేశారు. చివరికి చేసేది లేక ఢిల్లీ బ్యాటింగ్ కొనసాగించింది. చివరి 3 బంతుల్లో ఆ జట్టు 2 పరుగులే చేయడంతో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.