Dinesh Karthik : ఓడే మ్యాచ్‌ని గెలిపించిన దినేష్ కార్తీక్.. చివర్లో ఎలాంటి మ్యాజిక్ చేశాడో తెలిస్తే ఆశ్చర్య‌పోతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dinesh Karthik : ఓడే మ్యాచ్‌ని గెలిపించిన దినేష్ కార్తీక్.. చివర్లో ఎలాంటి మ్యాజిక్ చేశాడో తెలిస్తే ఆశ్చర్య‌పోతారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2024,2:00 pm

Dinesh Karthik : ఐపీఎల్ సీజ‌న్ 17 చాలా హోరా హోరీగా సాగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్‌లు అన్నీ కూడా చివ‌రి వ‌ర‌కు రక్తి క‌ట్టించాయి. అయితే ఈ సీజ‌న్‌లో ఆర్సీబీ రెండు మ్యాచ్‌లు ఆడ‌గా అందులో ఒక‌టి గెలిచి, ఇంకొకటి ఓడింది. ముందుగా చెన్నైతో ఆడిన ఆర్సీబీ అందులో ఓడింది. ఇక నిన్న‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓట‌మి అంచుల వ‌ర‌కు వెళ్లిన ఆ టీంని దినేష్ కార్తీక్ గ‌ట్టెక్కించాడు. దీంతో బెంగళూరు జట్టు తొలి విజయాన్ని రుచి చూసింది. ఆర్సీబీ, పంజాబ్ మ‌ధ్య జ‌రిగిన తాజా మ్యాచ్‌లో ముందుగా పంజాబ్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట‌ల్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25), జితేశ్ శర్మ(20 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27) జ‌ట్టుకి కావ‌ల్సిన ప‌రుగులు రాబ‌ట్టారు. చివర్లో శశాంక్ సింగ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21 నాటౌట్) ధాటిగా ఆడ‌డంతో పంజాబ్ జ‌ట్టు 170 మార్క్ దాటింది.

ఇక లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి గెలుపొందింది. డుప్లెసిస్ మ‌రోసారి నిరాశ‌ప‌ర‌గా, విరాట్ కోహ్లీ(49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. దినేశ్ కార్తీక్(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్), మహిపాల్ లోమ్రోర్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 17 నాటౌట్) సంచలన ప్రదర్శన క‌న‌బ‌రిచి తమ జ‌ట్టుకి మంచి విజ‌యం అందించారు. తొలి ఓవర్‌లోనే కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో బెయిర్ స్టో నేలపాలు చేయ‌డంతో ఆర్సీబీ జ‌ట్టు ఊపిరి పీల్చుకుంది. త‌న‌కి వ‌చ్చిన అవ‌కాశం స‌ద్వినియోగం చేసుకున్న విరాట్ ఆ త‌ర్వాత వేగంగా ప‌రుగులు చేశాడు.

లక్ష్యం దిశగా సాగుతున్న ఆర్‌సీబీకి హర్‌ప్రీత్ బ్రార్ పెద్ద షాక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో రజత్ పటీదార్(18), గ్లేన్ మ్యాక్స్‌వెల్(3)లను ఔట్ చేయ‌డంతో మ‌ళ్లీ మ్యాచ్ పంజాబ్ వైపుకి తిరిగింది. కాని కోహ్లీ క్రీజులో ఉన్నాడు కాబ‌ట్టి ఎక్క‌డో ఆశ‌లు ఉన్నాయి. హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన విరాట్ కోహ్లీ.. అదే జోరులో మరో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం అనూజ్ రావత్‌(11)ను సామ్ కరన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించ‌డంతో మ్యాచ్ ఉత్కంఠ‌గా మారింది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్ త‌మ జ‌ట్టుని గెలిపించే బాధ్య‌త తీసుకున్నారు. ఆర్‌సీబీ విజయానికి చివరి 12 బంతుల్లో 23 పరుగులు అవసరం కాగా,హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ ఓ ఫోర్, సిక్స్‌తో 13 పరుగులు రాబ‌ట్టాడు. ఇక చివ‌రి ఓవ‌ర్‌లో ప‌ది ప‌రుగులు అవ‌స‌రం కాగా, తొలి రెండు బంతులను కార్తీక్ ఫోర్, సిక్స్ కొట్టి ఆర్సీబీకి ఈ సీజ‌న్‌లో తొలి విజ‌యాన్ని అందించాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది