Pakistan : ఇది విచిత్రంగా ఉందే.. భారత్ గెలవాలని పాక్ అభిమానులు ఇంతగా ప్రార్ధనలు చేస్తున్నారేంటి?
Pakistan: ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుముంటుందనే విషయం మనందరికి తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ పోరు చాలా రసవత్తరంగా సాగుతుంటుంది. ఇటీవల పాక్ ఇండియా మధ్య వరల్డ్ కప్ ఫైట్ జరగగా ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. కోహ్లీ అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఎప్పుడు పాక్ అభిమానులు.. భారత్ ఓడిపోవాలని పూజలు చేస్తుండడం మనం చూస్తూ ఉంటాం. కాని ఇప్పుడు వారు గెలవాలని పూజలు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. టీ20 వరల్డ్ కప్‌లో నేడు అత్యంత కీలక పోరు జరగనుంది. పెర్త్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ ఇరు జట్లకు మాత్రమే కాకుండా పాకిస్థాన్‌కు కూడా కీలకమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలుస్తుంది. సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం.. దాయాది టాప్-4లో నిలిచే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ క్రమంలో పాక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ గెలుపు కోసం ఆ దేశం ప్రార్థించాల్సిన పరిస్థితి తలెత్తింది. పాకిస్థాన్ ఇంకా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లోనూ అది విజయం సాధించినా సెమీస్‌కు చేరడం కష్టమే. బాబర్ సేన సెమీస్‌కు చేరుకోవాలంటే భారత జట్టు నేడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తోపాటు జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపైనా విజయం సాధించాలి.
Pakistan పూజలు ఎందుకో తెలుసా?
భారత్ తలపడే మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు.ఇక భారత్, దక్షిణాఫ్రికా విషయానికి వస్తే… 25 రోజుల క్రితమే ఇరు జట్లు భారత గడ్డ మీద టీ20 సిరీస్ ఆడగా.. 2-1 తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ ఏడాది ఇరు జట్లు ఇప్పటికే 8 టీ20ల్లో ముఖాముఖి తలపడగా.. పెర్త్ మ్యాచ్ భారత్ వెలుపల తొలి పోరు కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. సెమీఫైనల్ దిశగా మరో ముందడుగు వేస్తుంది. సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. భారత జట్టులో సూర్య, విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. నెదర్లాండ్స్‌పై రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు.