Ravindra Jadeja : చెన్నై సూపర్ కింగ్స్‌కి గుడ్ బై చెప్పిన రవీంద్ర జడేజా.. ఈ నిర్ణయం వెనక కారణం?
Ravindra Jadeja : కొద్ది రోజులుగా జడేజా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు.. జట్టు యాజమాన్యానికి మధ్య విబేధాలు వచ్చాయని.. అందుకే అతడిని గాయం పేరు చెప్పి సీజన్ మొత్తం తప్పించారని మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. కెప్టెన్ గా జడ్డూ చెన్నై యాజమాన్యాన్ని మెప్పించకపోవడం.. అనూహ్య పరిస్థితుల్లో సారథి గా వైదొలగడం.. తర్వాత కొన్ని రోజులకే చెన్నై సోషల్ మీడియా ఖాతాలను అతడు అన్‌ఫాలో చేయడం.. రెండ్రోజుల క్రితం సీఎస్కే కూడా అదే పనిచేయడంతో జడ్డూ-సీఎస్కే యాజమాన్యం మధ్య ఏదో జరిగిందని మాత్రం మీడియా కోడై కూస్తున్నది.
ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న అన్ని సీఎస్‌కే పోస్టులను డిలీట్ చేశాడు. 2021తో పాటు 2022 సీజన్‌కు చెందిన అన్ని ఫోటోలు, వీడియోలను జడేజా డిలీట్ చేశాడు. దీంతో ఆల్ రౌండర్ జడేజాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్‌కే మధ్య విబేధాలు ఉన్నట్లు అర్థమవుతోంది. 2022 సీజన్‌లో కెప్టెన్‌గా చేసిన జడేజా .. సిరీస్ మధ్యలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇన్‌స్టా ప్రొఫైల్ నుంచి పోస్టులను డిలీట్ చేసిన అంశాన్ని సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ గుర్తించారు. ఇక ఈ ఏడాది ధోనీ బర్త్ డేకు కూడా జడేజా విషెస్ చెప్పలేదు. బహుశా 2023 సీజన్‌లో జడేజా .. చెన్నై జట్టును వీడే అవకాశాలు ఉన్నట్లు ఓ అభిమాని తెలిపాడు.
Ravindra Jadeja : ఎంత నిజం?
కొన్ని రోజుల క్రితం సీఎస్కే వర్గాల ప్రకారం.. ‘అవును.. జడేజాకు గాయమైన మాట వాస్తవమే. కానీ సీఎస్కే యాజమన్యానికి జడేజా కు మధ్య అంతా బాగాలేదన్నది కూడా నిజం. కెప్టెన్ గా తొలగించడంతో అతడు నిరాశకు గురయ్యాడు..’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రీసెంట్ సీజన్ లో సీఎస్కే తరఫున 10 మ్యాచులాడిన జడ్డూ.. బ్యాటింగ్ లో 116 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 33 ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కెప్టెన్ గా 8 మ్యాచులకు సారథ్యం వహించి రెండింట్లో గెలిచి ఆరు మ్యాచుల్లో ఓడాడు. రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ జడ్డూ.. ఆ తర్వాత చెన్నై ఆడిన మూడు మ్యాచుల్లో కనిపించలేదు.