Rohit Sharma : టీ 20లకు రోహిత్ శర్మ గుడ్ బై.. ఐపీఎల్ తర్వాత అసలు క్లారిటీ ఇస్తానన్న హిట్ మ్యాన్..!!
Rohit Sharma : ఇటీవల టీమిండియా ఆటగాళ్లపై పనిభారం పడుతోందంటూ తెగ వార్తలు వస్తున్నాయి. స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో కెప్టెన్సీ వహిస్తుండగా, టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడన్న ఊహాగానాలు తెగ హల్‌చల్ చేశాయి.. దీనిపై రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకునే ఆలోచనేదీ లేదని చెప్పుకొచ్చాడు. ఇటీవల శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడిన టీమిండియా నుంచి రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి కల్పించడంతో ఆ సిరీస్‌కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించారు. కొత్త కుర్రాళ్లతో సిరీస్‌ని 2-1తో గెలిచాడు. పాండ్యా కెప్టెన్సీలో కుర్రాళ్లు రాణిస్తుండగా, వచ్చే వరల్డ్ కప్ దిశగా
హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టును నిర్మించేందుకు బోర్డు ప్రణాళికలు రచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా గువహతి వేదికగా మంగళవారం జరగనున్న తొలి వన్డే నేపథ్యంలో సోమవారం రోహిత్ మీడియాతో ముచ్చటించాడు. ‘టీ20 ఫార్మాట్‌ను వదిలేయాలని నేను నిర్ణయించుకోలేదు. ముందుగా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఆడటం సాధ్యం కాదు కాబట్టే మూడు ఫార్మాట్ల ప్లేయర్‌కు కావాల్సినంత విశ్రాంతినివ్వాలి అని రెస్ట్ తీసుకున్నాం. రానున్న రోజులలో న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఉంది. ఐపీఎల్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. టీ20 ఫార్మాట్‌ను మాత్రం వదులుకోవాలని నిర్ణయించుకోలేదు.’
అని తెలిపాడు రోహిత్ శర్మ.ఇక బుమ్రా జట్టులోకి వస్తాడని అందరు ఎదురు చూస్తున్న సమయంలో బీసీసీఐ అతినికి మరి కొద్ది రోజులు విశ్రాంతి ఇవ్వాలని భావించింది. దీనిపై స్పందించిన రోహిత్ శర్మ .. ఎన్‌సీఏలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా వెన్నులో పట్టేసిందని, దాంతోనే అతన్ని తప్పించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అది చిన్న గాయమేనని స్పష్టం చేశాడు. బుమ్రానే అసౌకర్యంగా ఉన్నానని చెప్పినప్పుడు పక్కనపెట్టకుండా ఎలా ఉంటామని, అతని గాయాల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైన ఉంటుంది కదా అని చెప్పుకొచ్చాడు రోహిత్.