IPL : ఐపీఎల్ వారి పాట.. ఒక్క మ్యాచ్‌కి రూ. 100 కోట్ల పైమాటే.. నోరెళ్లపెడుతున్న నెటిజన్స్
IPL : ప్రస్తుతం క్రికెట్‌లో ఐపీఎల్‌కి ఉన్న క్రేజ్ మరేదానికి లేదనే చెప్పాలి. ఏ ముహూర్తాన ఐపీఎల్‌కు శ్రీకారం చుట్టారో కానీ.. ఈ లీగ్‌తో బీసీసీఐ ఏటికేడు తన ఖజానాను ఊహించని స్థాయిలో నింపుకొంటోంది. పైసాకు రెండింతలు లాభం తెచ్చిపెట్టే ఈ ధనాధన్ లీగ్ హక్కుల కోసం ప్రసారకర్తలు కోటానుకోట్లు కుమ్మరిస్తున్నారు. 2023-2027 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్న ఈ-వేలం జోరుగా సాగుతోంది. ఆదివారం మొదలైన ఈ ప్రక్రియలో తొలిరోజుకు మీడియా ప్రసార హక్కు (ఉపఖండంలో టీవీ, డిజిటల్)ల విలువ రూ. 43,050 కోట్ల దాకా సాగిందని సమాచారం.
టీవీ ప్రసారం హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఇది రూ. 100 కోట్ల మార్కు దాటిందని తెలుస్తున్నది. క్రిక్ బజ్ లో వచ్చిన సమాచారం మేరకు.. ‘ఒక్కో మ్యాచ్ విలువ రూ. 100 కోట్లు దాటింది.. బీసీసీఐకి ఇది తొలి విజయం..’ అని ఓ అధికారి వెల్లడించడం గమనార్హం. ఇక టీవీ ప్రసార హక్కుల వేలం రూ. 24 వేల కోట్లు చేరిందని.. డిజిటల్ హక్కులు రూ. 19 వేల కోట్లు దాటాయని తెలుస్తున్నది. మొత్తానికి ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రూ. 43 వేల కోట్లు దాటిందని సమాచారం. ఈ అంకె ప్రతి అరగంటకూ పెరుగుతున్నది. ఇ-వేలం సోమవారం కూడా కొనసాగనుంది.
IPL : మాములు డిమాండ్ లేదు..
దీనిని బట్టి చూస్తే బీసీసీఐ పెట్టుకున్న టార్గెట్ (రూ. 50వేల కోట్లు) రీచ్ అవడం పెద్ద విషయమేమీ కాదని తెలుస్తున్నది. ప్రస్తుతం ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ లు పోటీలో ఉన్నాయి. 2017-2022 కాలానికి గాను (డిస్నీ స్టార్) మీడియా హక్కుల ప్రారంభ ధర రూ. 16 వేల కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా డబుల్ (రూ. 32 వేల కోట్లు) అయింది. పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకున్నా పోటీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే బీసీసీఐ.. రూ. 60 వేల కోట్లు ఆర్జించినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదంటున్నారు మార్కెట్ నిపుణులు.