Congress : హస్తం గూటికి ఆరుగురు బీఆర్ఎస్ కీలక నేతలు.. వాళ్లు ఎవరో తెలుసా?
Congress : తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఒకేసారి 115 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించేశారు సీఎం కేసీఆర్. దీంతో రాజకీయాలు కాస్త వేడెక్కాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. తెలంగాణలో ఉన్నదే 119 అసెంబ్లీ సీట్లు. అందులో 115 సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరో ఎన్నికలకు మూడు నెలల ముందే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలు కంగుతిన్నాయి. ఏది ఏమైనా.. 115 మంది అభ్యర్థుల్లో ఎక్కువ శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే. అయితే అందులో కొందరు సిట్టింగ్ లకు మాత్రం సీట్లు దక్కలేదు. అలాగే.. తమకు ఈసారైనా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ నేతలు కూడా ఉన్నారు.
వీళ్లంతా కలిసి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇప్పటికే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. అదే నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయన లాగానే మరికొందరు నేతలు కూడా ఉన్నారు. కీలక నేతలు కొందరు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.టికెట్లు ప్రకటించగానే.. బీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు ప్రారంభమయ్యాయి. ఇదే చాన్స్ అని భావించిన కాంగ్రెస్ అసంతృప్తి నేతలపై గాలం వేస్తోంది. వాళ్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరుపుతోంది.
Congress : బీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్న కాంగ్రెస్
ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఆరుగురు కీలక నేతలు ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరుతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేతలు కనుక కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ కు అది మైనసే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే వేముల వీరేశం కన్ఫమ్ చేయగా.. మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మతరావు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, నీలం మధు, జలగం వెంకట్రావు, భేతి సుభాష్ రెడ్డి లాంటి నేతలు బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ లో టికెట్ హామీ వస్తే ఇక వెంటనే జంప్ అయిపోవడమే.