Revanth Reddy VS Kavitha : మూడేళ్లలోనే మేడిగడ్డ కుంగిపోయింది అన్న రేవంత్ రెడ్డి.. మీచేతుల్లోనే అధికారం ఉంది కదా అన్న కవిత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy VS Kavitha : మూడేళ్లలోనే మేడిగడ్డ కుంగిపోయింది అన్న రేవంత్ రెడ్డి.. మీచేతుల్లోనే అధికారం ఉంది కదా అన్న కవిత

 Authored By kranthi | The Telugu News | Updated on :17 December 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం కూలిపోయింది అన్న రేవంత్

  •  అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సందర్శనకు తీసుకెళ్తా అన్న రేవంత్

  •  ప్రభుత్వమే మీ చేతుల్లో ఉంది కదా విచారణ చేసుకోండి అన్న కవిత

Revanth Reddy VS Kavitha : నీళ్ల గురించి, ప్రాజెక్టుల గురించి తెలంగాణ రైతులకు చివరి ఎకరాకు, ఆఖరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని, ఇంకెంత కాలం తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు. నేను ఎక్కువ లోతుకు వెళ్లదలుచుకోలేదు. లక్షా 50 వేల కోట్ల ప్రతిపాదనలతో లక్షా 2 వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం పగిలిపోయింది. మన కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తోంది. మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కడితే ఇసుక కదిలింది. మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకు తెలియదు. మేమూ నాగార్జున సాగర్ కట్టినం. మేమూ శ్రీశైలం కట్టినం. మేమూ జూరాల కట్టినం. మేమూ శ్రీరాంసాగర్ కట్టినం. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడ్డ ప్రాజెక్టులు అవి. కళ్లముందు సజీవంగా ఉన్నాయన్నారు. కానీ.. మూడేళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది. అయినా కూడా ఇంకా మేము ప్రాజెక్టులు కట్టాం అని చెబుతున్నారు. రైతులకే ఈ ప్రాజెక్టుల దగ్గరికి సందర్శనకు పంపించండి. మంత్రి గారిని అనుమతి అడుగుతున్నా. మాకు అందరికీ అక్కడికి వచ్చే ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉన్న అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులను సందర్శనకు తీసుకెళ్తా. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చూపిస్తాం అన్నారు రేవంత్ రెడ్డి.

దీంతో అంతా మీ చేతుల్లోనే ఉంది కదా. విచారణ చేసుకోవచ్చు కదా అని వెంటనే ఎమ్మెల్సీ కవిత అనడంతో తప్పకుండా మీ సూచనను తీసుకుంటాం. ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాం. ఈరకంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే ఖచ్చితంగా చేస్తాం. జీవన్ రెడ్డి కూడా అదే చెప్పారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని విచారణకు ఆదేశిస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. దీంతో కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదే పదే ఆ విషయాన్ని చెబుతున్నారు. తప్పు జరిగితే తప్పును నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు. అదేం టూరిస్టు కాదు.. అక్కడికి సందర్శనకు తీసుకెళ్లడానికి అంటూ కవిత అనడంతో ఇక్కడ ఉన్న సభ్యులకు అపోహలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నాయి. అందుకే వాళ్లను అందరినీ అక్కడికి తీసుకెళ్తామని చెబుతున్నాం. ఆ సభ్యురాలికి ఏంటి సమస్య అనేది నాకు అర్థం కావడం లేదన్నారు.

Revanth Reddy VS Kavitha : నిజాం చక్కెర కర్మాగారాలు అన్నీ తెరిపిస్తాం

ఏ విచారణ అయినా, విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరు అని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది. నచ్చితే నజరానా.. నచ్చకపోతే జరిమానా అనే విధానం ఉండదు. నిస్పక్షపాత విచారణ చేస్తాం. నిజాం ప్రారంభించిన చక్కెర కర్మగారం పున:ప్రారంభించాలని కోరుతున్నారు. మా ప్రభుత్వం నిజాం చక్కెర కర్మగారాలను తెరిపించడానికి కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండటానికి ఆఫీసర్స్ కమిటీ, మినిస్టర్స్ కమిటీ వేసి వాళ్ల నుంచి నివేదిక తీసుకొచ్చి తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది