Vemula Veeresham : బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. నకిరేకల్‌లో పోటీ చేస్తా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం..!
Vemula Veeresham : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ KCR అందరి కంటే ముందే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. మూడు నెలల ముందే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును మీడియా ముందు పెట్టారు. ఇప్పటి వరకు ఏ ఇతర పార్టీ కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం 115 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి అందరికీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఎందుకంటే.. చాలామంది బీఆర్ఎస్ నేతలు ఈసారి తమకు టికెట్ దక్కుతుందని ఆశపడ్డారు.
కానీ.. ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో తమకు టికెట్ వస్తుంది అని ఆశపడ్డ చాలామంది నేతలు అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి చాలామంది ఆశావహులు టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేశారు. కానీ.. వాళ్లలో చాలామందికి నిరాశే మిగిలింది అని చెప్పుకోవాలి. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఆయన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే. ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. వెంటనే తన అనుచరులతో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిరేకల్ నుంచి పోటీ చేస్తా. తన అనుచరులతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో వేముల వీరేశం చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో చర్చించి త్వరలో ఏ పార్టీలో చేరుతానో ప్రకటిస్తాను అని ఆయన తెలిపారు.
Vemula Veeresham : వీళ్లందరికీ మొండి చేయి
అలాగే.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి, మునుగోడు నుంచి కర్నాటి విద్యాసాగర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, చాడ కిషన్ రెడ్డి, శశిధర్ రెడ్డి.. ఇలా చాలామంది ఉన్నారు లిస్టులో.. వీళ్లకు కూడా టికెట్స్ దక్కలేదు. ఈ నేతలు అందరూ తమకు టికెట్ వస్తుందని అనుకున్నారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం వాళ్లెవ్వరికీ టికెట్ ఇవ్వకుండా నల్గొండ జిల్లాలో అందరు సిట్టింగ్ లకే టికెట్స్ ఇచ్చారు. దీంతో టికెట్స్ ఆశించి భంగపడిన నేతలు నల్గొండ జిల్లాకు చెందిన నేతలు అందరూ తమ భవిష్యత్తు కార్యాచరణపై తమ అనుచరులతో సమావేశం అయ్యారు. వీళ్లంతా కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. తమ అనుచరులతోనూ పలువురు నేతలు చర్చిస్తున్నారు. వేరే పార్టీలకు వెళ్లే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.