Tummala : తుమ్మలతో పాటు హస్తం గూటికి ఐదుగురు కీలక నేతలు?
Tummala : ఖమ్మం సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ చేరిక దాదాపు ఖాయం అనే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు ఈ మధ్య ప్రాధాన్యత తగ్గింది. అయినా ఆయన పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. దానికి కారణం.. కనీసం 2023 ఎన్నికల్లో అయినా తనకు టికెట్ వస్తుందని భావించారు. కానీ.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో తుమ్మల పేరు లేదు. పాలేరు నుంచి తుమ్మల టికెట్ ఆశించినా.. తనకు టికెట్ దక్కలేదు. దీంతో అప్పటి నుంచి తుమ్మల బీఆర్ఎస్ హైకమాండ్ పై తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారు.బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి నేతలపై కన్నేసిన కాంగ్రెస్ తుమ్మలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది.
తుమ్మలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలు హస్తగతం చేసుకోవచ్చని ఇప్పటికే రేవంత రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి లాంటి కీలక నేతలు తుమ్మలతో భేటీ అయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి కూడా త్వరలోనే తుమ్మలతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో తుమ్మల కూడా కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.తుమ్మల కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత చూపిస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు వచ్చినట్టయింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
Tummala : తుమ్మల ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు?
ఎలాగూ తుమ్మల, రేవంత్ రెడ్డి ఇద్దరూ గతంలో టీడీపీలో కలిసి పని చేశారు. అందుకే తుమ్మల చేరిక కోసం రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. తుమ్మలతో పాటు పలువురు ఇతర కీలక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే జలగం, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యే మైనంపల్లిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీళ్లంతా కాంగ్రెస్ లో చేరితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం దాదాపు ఖరారు అయిపోయినట్టే.