Telangana Praja Palana Application Form : ఐదు గ్యారంటీల దరఖాస్తు ఫారం ఏ విధంగా నింపాలి.. ఈ వీడియో చూడండి..!
ప్రధానాంశాలు:
ప్రజా పాలన దరఖాస్తు ఎలా నింపాలి?
5 గ్యారెంటీ హామీలకు ఒకే దరఖాస్తు నింపాలా?
రైతు బంధు కోసం మళ్లీ వివరాలు ఇవ్వాలా?
Telangana Praja Palana Application Form : తెలంగాణ ప్రభుత్వం అభయహస్తంలో భాగంగా ప్రజా పాలన దరఖాస్తును విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజా పాలన దరఖాస్తును 28 డిసెంబర్ 2023 నుంచి జనవరి 6, 2024 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం తీసుకొచ్చారు. ఈ ఐదు గ్యారెంటీ స్కీమ్స్ కోసం ఒకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులే ఈ ఫామ్ ను ఉచితంగా ప్రజలకు అందిస్తారు. గ్రామాల్లో పంచాయతీ ఆఫీసుకు వెళ్తే ఫామ్ ను ఉచితంగా అందిస్తారు. ఈ ఫామ్ తీసుకొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో అడిగిన అన్ని వివరాలు కరెక్ట్ గా నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు సంఖ్య ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారు వివరాల్లో ఇంటి యజమాని పేరు ఇవ్వాలి. ఆ తర్వాత స్త్రీ, పురుషుడు టికెట్ చేసి.. తమ సామాజిక వర్గం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ల వివరాలు పొందుపరచాలి. వాళ్ల పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలమ్ లో 10 నెంబర్ లో చిరునామా ఇవ్వాలి.
అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందటానికి వివరాలు ఆ తర్వాత ఇవ్వాలి. కావాల్సిన పథకాలు కోసం అంటే మీరు ఏ పథకాలకు అర్హత పొందుతారో వాటికే టిక్ పెట్టాలి. మహాలక్ష్మీ పథకం కింద ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయం కోసం టిక్ ఇవ్వాలి. ఆ తర్వాత 500 కే గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నెంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఇవ్వాలి. ఆ తర్వాత రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తున్నారు. దాని కోసం రైతు అయితే రైతు మీద టికెట్ చేయాలి. కౌలు రైతు అయితే కౌలు రైతు మీద టిక్ చేయాలి. ఆ తర్వాత పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా ఇవ్వాలి. సర్వే నెంబర్, విస్తీర్ణం వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యవసాయ కూలీలు అయితే ఏటా రూ.12 వేల కోసం ఉపాధి హామీ కార్డు నెంబర్ పొందుపర్చాల్సి ఉంటుంది.
Telangana Praja Palana Application Form : ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తారు. ఒకవేళ అమరవీరులు, ఉద్యమకారులు అయితే వాళ్లకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తారు. అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబర్, డెత్ సర్టిఫికెట్ నెంబర్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవును అని లేకపోతే కాదు అని ఇవ్వాలి. అవును అని ఇస్తే.. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్, సంవత్సరం, జైలుకు వెళ్లి ఉంటే ఆ వివరాలు కూడా ఇవ్వాలి. జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు ఇవ్వాలి.
ఆ తర్వాత గృహ జ్యోతి పథకం కింద ప్రతి నెల కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు. మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగం ఎంత.. అనేది కూడా చూసుకొని టిక్ మార్క్ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ ఇవ్వాలి. చేయూత పథకం కింద నెలకు రూ.4000, దివ్యాంగుల పింఛన్ కింద రూ.6 వేలు పొందేందుకు కింది వివరాలు ఇవ్వాలి. చేయూత పథకం కింద నెలకు రూ.4 వేలు, దివ్యాంగుల కోసం రూ.6 వేల పింఛన్ ఇస్తారు. అయితే.. ఇందులో ప్రస్తుతం పింఛన్ పొందే వాళ్లు దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్లు అర్హులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఫామ్ మొత్తం నింపిన తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి సంతకం పెట్టి పేరు, తేదీ ఇవ్వాలి. అధికారి ఆ ఫామ్ ను పరిశీలించి ప్రజా పాలన దరఖాస్తు రశీదు ఇస్తారు. మీరు ఏ స్కీమ్ కోసం దరఖాస్తు చేస్తారో ఆ స్కీమ్ కి టిక్ పెట్టి అధికారి సంతకం పెట్టి రసీదు ఇస్తాడు.