KCR : ఆ ఎమ్మెల్యేలతో కేసీఆర్ కు కొత్త తలనొప్పి.. చాప కింద నీరులా ఆ పార్టీతో పాగ!
KCR : తెలంగాణలో బీజేపీ జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంత జోష్ బీజేపీ క్యాడర్ లో కనిపిస్తుంది. కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు చేప్పటినప్పటి నుండి కూడా బీజేపీలో జోరు కనిపిస్తూ ఉంది. మరో వైపు కేసీఆర్ కూడా ఏమాత్రం తగ్గకుండా బీజేపీకి మరింత ధీటుగా పార్టీని నిర్మించుకుంటూ ప్రజల్లోకి తీసుకు వెళ్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకుని మరీ సమకూర్చుతూ ఉన్నాడు. అయినా కూడా సీఎం కేసీఆర్ లో ఎక్కడో ఆందోళన వ్యక్తం అవుతుందట. ఇప్పుడు సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్న అంశం కొంత మంది ఎమ్మెల్యేలు నియోజక వర్గ ప్రజలకు దూరంగా ఉండటం. ఎవరైతే నియోజక వర్గంకు దూరంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్నారో వారి స్థానంలో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందట.
KCR : సీఎం కేసీఆర్ మీటింగ్ పెట్టి మరీ…
బీజేపీ కొత్త ఎత్తుగడను తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఆ విషయమై క్లాస్ పీకారనే వార్తలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్ కు చెందిన దాదాపు పాతిక మంది ఎమ్మెల్యేలు నియోజక వర్గంలో ఎక్కువగా ఉండకుండా సీఎం కేసీఆర్ దృష్టికి తమ నియోజక వర్గ సమస్యలు తీసుకు రాకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారట. వారిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మీటింగ్ పెట్టి మరీ వారిని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడట. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీటు ఉండేది లేనిది చెప్పలేమంటూ సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలను సున్నితంగా హెచ్చరించారని కూడా అంటున్నారు.
KCR : వారంలో రెండు మూడు రోజులు అయినా…
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా ఇప్పటి నుండే ఎందుకు లే అని కొందరు ఎమ్మెల్యేలు నియోజక వర్గం మొహం చూడటం లేదని కేసీఆర్ దృష్టికి వచ్చిందట. వారందరికి కూడా క్లీయర్ గా కేసీఆర్ చెప్పిన విషయం ఏంటీ అంటే వారంలో కనీసం రెండు మూడు రోజులు అయినా నియోజక వర్గంలో పర్యటించాలి. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు పరిష్కరించి ప్రజల్లో ఉంటున్నట్లుగా జనాలకు తెలిసేలా మీడియాలో ఉండాలి అంటూ కేసీఆర్ సూచనలు చేశాడట. కాస్త సందు ఇస్తే కచ్చితంగా దూరి పోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే కేసీఆర్ ఇలా ముందస్తు జాగ్రత్తలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ చాప కింద నీరు మాదిరిగా విస్తరించుకుండానే పసిగట్టాలని కేసీఆర్ రాజకీయ చతురతతో ఆలోచిస్తున్నారు.